పిల్లనిచ్చి పెళ్లిచేసిన అత్తను అల్లుడు అతి కిరాతకంగా నరికిచంపిన దారుణ విజయవాడలో చోటుచేసుకుంది.
విజయవాడ : భార్యను తనకు దూరం చేస్తున్నారన్న కోపంతో అత్తామామలపై అల్లుడు కక్షగట్టి దారుణానికి ఒడిగట్టాడు. శనివారం రాత్రి అత్తామామ బైక్ పై వెళుతుండగా గమనించి వారిని వెంబడించిన అల్లుడు నడిరోడ్డుపైనే కత్తితో దాడిచేసాడు. కొబ్బరిబోండాల కత్తితో విచక్షణారహితంగా నరకడంతో అత్త ప్రాణాలు కోల్పోగా మామ తప్పించుకుని ప్రాణాలతో భయటపడ్డాడు. ఈ దారుణం విజయవాడలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ వైఎస్సార్ కాలనీలో నివాసముండే గోగుల గురుస్వామి, నాగమణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. రెండో కూతురు లలితకు ఏకలవ్యనగర్ కు చెందిన రాజేష్ కు ఇచ్చి పెళ్లిచేసారు. అయితే వీరిమధ్య మనస్పర్దలు తలెత్తి గొడవలు జరగడంతో ఇద్దరు పిల్లలతో కలిసి లలిత పుట్టింట్లోనే వుంటోంది. అంతేకాదు భర్తతో విడాకులకు సిద్దపడిన ఆమె కోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది.
అయితే తనకు భార్య దూరంచేసింది అత్తామామలేనంటూ వారిపై కోపం పెంచుకున్న రాజేష్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరిని హతమార్చేందుకు సిద్దమయ్యాడు. అదునుకోసం ఎదురుచూస్తున్న రాజేష్ కు శనివారం రాత్రి బైక్ పై పెద్దకూతురు ఇంటికి వెళుతున్న అత్తామామ కనిపించారు. వెంటనే అతడు కూడా కొబ్బరిబోండాలు నరికే కత్తి తీసుకుని వారిని వెంబడించాడు. చిట్టినగర్ సమీపంలోని చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై బైక్ వెనకాల కూర్చున్న అత్తను కత్తితో నరికాడు. వెంటనే ఆమె కిందపడిపోవడంతో కత్తితో విచక్షణారహితంగా నరికేసాడు. మామ గురుస్వామిని కూడా చంపడానికి వెంటపడగా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అత్త ప్రాణాలు కోల్పోయిందని నిర్దారించుకున్న తర్వాతే రాజేష్ అక్కడినుండి వెళ్లిపోయాడు. ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజేష్ ప్రస్తుతం పరారీలో వున్నాడని... అతడికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తల్లిని భర్త హతమార్చడంపై లలిత స్పందించారు. పెళ్ళైన నాటినుండి భర్త రాజేన్ తనను ఒక్కసారి కూడా ప్రేమగా చూడలేదని అన్నారు. గంజాయి, బ్లేడ్ గ్యాంగులతో తిరిగుతూ తనను చిత్రహింసలకు గురచేసేవాడని తెలిపింది. అతడి వేధింపులు భరించలేకే పుట్టింటికి వచ్చి వుంటున్నానని... అయినా కూడా అతడి వేధింపులు ఆపలేదని అన్నారు. కూలీనాలి చేసుకోగా వచ్చిన డబ్బును కూడా లాక్కుని వెళ్లేవాడని లలిత తెలిపింది.
