Asianet News TeluguAsianet News Telugu

హత్య చేసి ఇంటికెళ్లారు, మరునాడు శవాన్ని ఇసుక ర్యాంపులో దాచారు

 మూఢ నమ్మకాల కారణంగా సొంత బంధువులే ఓ గిరిజనుడిని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక మండలం అయ్యవారిపేట గ్రామంలో చోటు చేసుకొంది.. 
 

man killed by relatives in East godavari district lns
Author
East Godavari, First Published Mar 12, 2021, 1:58 PM IST

కాకినాడ: మూఢ నమ్మకాల కారణంగా సొంత బంధువులే ఓ గిరిజనుడిని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక మండలం అయ్యవారిపేట గ్రామంలో చోటు చేసుకొంది.. 

అయ్యవారిపేట గ్రామానికి చెందిన వేల్పుల సత్యనారాయణకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు మూడుసార్లు పిల్లలు పుట్టి కొద్ది రోజుల్లోనే మరణించారు. వరుసకు బాబాయి అయిన వేల్పుల రత్తయ్యే (55) దీనికి కారణమని సత్యనారాయణకు అనుమానం వచ్చింది. ఓ అమావాస్య రాత్రి గ్రామ సమీపంలోని ఓ చెట్టు వద్ద రత్తయ్య నగ్నంగా పూజలు చేస్తున్నట్టు గమనించి తాము వెళ్లగా దుస్తులు చేతబట్టుకుని అతడు పారిపోయాడని సత్యనారాయణ చెబుతున్నాడు.

రత్తయ్య క్షుద్రపూజలు చేయడంవల్లే తన పిల్లలు చనిపోతున్నారని సత్యనారాయణ అనుమానించాడు. ఈ నేపథ్యంలో రత్తయ్యను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన అన్న ప్రసాద్‌ సాయంతో పథకం వేశాడు. 

ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం రత్తయ్య కంచె వేసేందుకు ఇంటి సమీపంలోని జామాయిల్‌ తోటకు వెళ్లాడు. అదే రోజు సత్యనారాయణ, ప్రసాద్‌లు మిర్చి బస్తాలు తొక్కేందుకు సమీప గ్రామానికి వెళ్లారు. 

కూలి పనుల అనంతరం వచ్చిన అన్నదమ్ములిద్దరూ చేనులో రత్తయ్య ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్నారు. పథకం ప్రకారం అక్కడికి వెళ్లి రత్తయ్యపై కత్తితో దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో దాచి ఇంటికి వచ్చేశారు.

రాత్రయినా తన తండ్రి ఇంటికి రాకపోవడంతో రత్తయ్య కుమారులు వెంకటేష్‌, సుధాకర్‌ చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. రత్తయ్య పని చేసిన పొలం వద్ద మృతదేహాన్ని నేలపై ఈడ్చుకు వెళ్లిన ఆనవాళ్లు, అక్కడికి కొద్ది దూరంలో పొదల మధ్య రక్తం ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల రత్తయ్యకు, సత్యనారాయణ, ప్రసాద్‌ కుటుంబాల మధ్య రహదారి నిర్మాణం, పంట పొలంలో బోరు వేసే విషయంలో తగాదాలు జరిగాయి.

ఈ కోణంలో పోలీసులు విచారణ జరిపారు. దగ్గరి బంధువులే ఈ హత్య చేసి ఉంటారని అనుమానించి, అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా రత్తయ్యను తామే చంపినట్టు సత్యనారాయణ, ప్రసాద్‌ అంగీకరించారు. 

హత్య చేసిన రాత్రే మరో ముగ్గురి సాయంతో రత్తయ్య మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకుని సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని గొమ్ముకొత్తగూడెం వద్ద గోదావరి నదిలో ఇసుక ర్యాంపు సమీపాన పాతి పెట్టారు. ఈ సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని బుధవారం గుర్తించారు. గురువారం రత్తయ్య మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాగా, తన తండ్రికి క్షుద్రపూజలు రావని నిందితులు కావాలనే ఇలా చెబుతున్నారని రత్తయ్య కుమారులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios