కదులుతున్న రైల్లోంచి జారి పట్టాలపై పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డాడో వ్యక్తి.  ఇంతటి అపాయకర సమయంలోనూ సమయస్పూర్తితో వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్నాడు.    

విజయవాడ : అతడు నిజంగానే మృత్యుంజయుడు. కదులుతున్న రైల్లోంచి పట్టాలపై పడిపోయాడు... ట్రైన్ అతడి పైనుండి దూసుకెళ్ళింది. కానీ శరీరంపై చిన్న గాయంకూడా లేకుండానే సురక్షితంగా బయటపడ్డారు. కళ్లముందే రైలుకింద పడినవ్యక్తి తాపీగా పైకిలేని ప్లాట్ ఫారం పైకి రావడం చూసినవారు అశ్చర్యపోయారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతటి భయానక పరిస్థితిలో కూడా సమయస్పూర్తితో వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్న వ్యక్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... నిన్న(శనివారం) రాత్రి 7-8 గంటల మధ్య విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రతాప్ అనే వ్యక్తి చేరుకున్నాడు. పనిపై విజయవాడకు వచ్చిన అతడు అనంతపురం వెళ్లే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఎక్కుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది. హడావుడిగా కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలుజారి పట్టాలపై పడిపోయాడు. దీంతో అతడి పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. 

అయితే ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా ప్రతాప్ సమయస్పూర్తితో వ్యవహరించాడు. పట్టాలపై పడిపోగానే కంగారుపడకుండా అలాగే పడుకుండి పోయాడు. దీంతో అతడి పైనుండి రైలు వేగంగా వెళ్లిపోయినా ప్రాణాలు దక్కాయి. ఇదంతా గమనిస్తున్న కొందరు రైలు వెళ్లిపోయినా పట్టాలపై ప్రాణభయంతో పడుకుని వున్న ప్రతాప్ ను ప్లాట్ ఫారం పైకి తీసుకొచ్చారు. ఎలాంటి గాయాలు లేకుండా అతడు బయటపడటం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా సమయస్పూర్తిగా వ్యవహరిస్తే మృత్యువును సైతం జయించవచ్చిన ప్రతాప్ నిరూపించాడు. 

వీడియో