విశాఖపట్టణం: భార్య మరణించడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తలిద్దరూ  వారం రోజుల వ్యవధిలో మరణించడంతో ఎనిమిది రోజుల పసికందు తల్లీదండ్రులు లేని అనాధగా మారింది. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటు చేసుకొంది.

విశాఖపట్టణం జిల్లాలోని సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసం ఉండే శ్రావణ్ కుమార్, అంబికలు ప్రేమించుకొన్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించారు. ఏడాది క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి చేసుకొనే  సమయానికే అంబికకకు ఫిట్స్ వ్యాధి ఉంది.

పెళ్లైన కొంత కాలానికి ఆమె గర్భం దాల్చింది. ఈ నెల 6వ తేదీన అంబికకు ఫిట్స్ వచ్చాయి. దీంతో అంబికను నగరంలోని కేజీహెచ్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స నిర్వహిస్తే పండంటి మగ బిడ్డ పుట్టింది.

also read:పశ్చిమ గోదావరిలో దారుణం: కరోనా లేదని చెప్పినా వైద్యం చేయలేదు, గర్భిణి మృతి

డెలీవరి సమయంలో  అంబికకు తీవ్రమైన ఫిట్స్ వచ్చాయి. డెలీవరి అయిన రెండు రోజులకు ఈ నెల 8వ తేదీన ఆమె మరణించింది. అంబిక మరణంతో భర్త శ్రావణ్ కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. భార్య మరణాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ నెల 12వ తేదీన సాయంత్రం సింహగిరిపై గిరిజన కాలనీకి సమీపంలోనే చెట్టుకు ఉరేసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు. వారం రోజుల వ్యవధిలోనే శ్రావణ్ కుమార్ , అంబికలు మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 

తల్లీదండ్రులు మరణించడంతో 8 రోజుల ఆ చిన్నారి అనాధగా మారాడు. పెళ్లైనా ఏడాదికే భార్యాభర్తలు మరణించడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.