ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ గర్భిణిని  చేర్చుకొనేందుకు ఆసుపత్రి యాజమాన్యాలు నిరాకరించాయి. దీంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె మృతి చెందింది. వైద్యు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని గర్భిణి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

కరోనా భయంతో గర్భిణిని చేర్చుకొనేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరించినట్టుగా  ఐభీమవరం గ్రామానికి చెందిన బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నిండు గర్భిణి కావడంతో ఆసుపత్రిలో చేర్చుకోవాలని కోరినా కూడ వినలేదని  కుటుంబసభ్యులు చెబుతున్నారు.

మరో వైపు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే సరికి ఆలస్యమైంది. ఆసుపత్రి వద్దకు చేరుకొన్న కొద్దిసేపటికే గర్భిణి మరణించింది.  కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా కూడ స్థానికంగా ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలు చేర్చుకోవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

కరోనా లేదని చెప్పినా కూడ వినలేదని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

also read:భీమవరంలో గర్భిణికి చికిత్స: క్వారంటైన్‌లో 12 మంది వైద్య సిబ్బంది

ఇదే తరహా ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి. గద్వాల జిల్లాకు చెందిన గర్భిణిని ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి కూడ వైద్యులు నిరాకరించడంతో హైద్రాబాద్ ఆసుపత్రిలో డెలీవరి అయిన కొద్దిసేపటికే తల్లీ బిడ్డ మరణించారు.

మరో వైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ గర్భిణిని చేర్చుకొనేందుకు హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరిస్తే రెండు రోజుల పాటు అంబులెన్స్ లోనే ఆమె ఉంది. చివరకు ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి హైద్రాబాద్ కోఠి ఆసుపత్రిలో చేరింది. అయితే సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో కడుపులోనే బిడ్డ మరణించింది. ఆమెకు ప్రాణాపాయం తప్పింది.