కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చాగలమర్రి మండలం బ్రాహ్మాణపల్లిలో థామస్ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది.

దీంతో కుటుంబసభ్యులు 108కి ఫోన్ చేశారు. అయితే ఊరి చుట్టూ వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామంలో 108 అడుగుపెట్టలేకపోయింది. దాంతో థామస్‌ను మంచంపై పడుకోబెట్టి 4 కిలోమీటర్లు మోసుకుంటూ పక్కనేవున్న గొట్లూరుకు తరలించారు అతని కుమారులు.

అష్టకష్టాలు పడి 108 వాహనం దగ్గరికి చేరుకున్నప్పటికీ దురదృష్టవశాత్తూ థామస్ మరణించాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.