రోడ్డు మీద మోటార్ బైక్‌తో ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసేమో లేదో చూసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. తాజాగా ఈ విషయాన్ని మరిచిపోయిన ఓ వ్యక్తి తన నిండు ప్రాణాన్ని పొగొట్టుకున్నాడు.

వివరాల్లోకి  వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఎక్కిడి దుర్గారావు (35) శుక్రవారం పాలకొల్లు వైపు నుంచి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్నాడు.

అయితే అతను హడావిడిలో స్కూటీకి వేసిన స్టాండ్‌ను తీయలేదు. ఈ క్రమంలో పాలకోడేరు మండలం పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపానికి వచ్చే సరికి స్కూటీకి వున్న స్టాండ్ రోడ్డుకు తగిలింది.

తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ రావడంలో ఆలస్యం జరగడంతో దుర్గారావు ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.