కడప: కూతురి ప్రేమ వివాహం తండ్రి మరణానికి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఎర్రగుంట్ల శాంతినగర్ కు చెందిన ప్రభాకర్, దానమ్మలకు చెందిన కూతురు మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమించి అతన్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత రక్షణ కోరతూ జూన్ 25వ తేదీన పోలీసులను ఆశ్రయించింది. 

దాంతో సీఐ సదాశివయ్య తల్లిదండ్రులను పోలీసు స్టేషన్ కు పిలిపించి వారితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ (45) శుక్రవారంనాడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల వల్లనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని దానమ్మ ఆరోపిస్తోంది. 

కూతురు ప్రేమవివాహం చేసుకుందనే బాధలో తాము ఉంటే స్టేషన్ కు పిలిపించి తనను, తన భర్తను, కుమారుడిని చితకబాదారని ఆమె అంటోంది. ఆ దెబ్బలను తట్టుకోలేక, అవమానాన్ని భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె అంటోంది.

అయితే, కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎర్రగుంట్ల అర్బన్ సీఐ సదాశివయ్య అన్నారు. స్టేషన్ లో తమపై దౌర్జన్యం చేశారని కానిస్టేబుల్ చంద్ర నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభాకర్, దానమ్మలపై, వారి కుమారుడిపై కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు.