అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్ డౌన్ శ్రీకాళహిస్తిలో ఒకరి ప్రాణం తీసింది. లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వెంకట రమణ అనే నాయి  బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాళహస్తిలో పెద్ద యెత్తున కోరనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గత 66 రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉంది. 

లాక్ డౌన్ కు ముందు వెంకటరమణ జీవితం సాఫీగానే సాగింది. లాక్ డౌన్ తర్వాత అతను కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని స్థితికి చేరుకున్నాడు. అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో అతను నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అతను చివరకు ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించాడు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11,637 శాంపిల్స్ ను పరీక్షించగా 33 మందికి కోవిడ్ 19 సోకినట్లు తేలింది.  గత 24 గంటల్లో 79 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. కరోనా వైరస్ తో తాజాగా కర్నూలులో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మరణించినవారి సంఖ్య 60కి చేరుకుంది.

తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2874కు చేరుకుంది. వీరిలో 2037 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 777 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో ఆరు కోయంబేడుతో లింకులున్నవే. కోయంబేడు నుంచి వచ్చినవారిలో కరోనా వైరస్ వ్యాధి సోకినవారిలో చిత్తూరు జిల్లాకు చెందినవారు నలుగురు ఉండగా, నెల్లూరు జిల్లాకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 111 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఈ 111 మంది కూడా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 345 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 22 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 156 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.