గుంటూరు: ఇంటి బయట నిద్రిస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు గుర్తుతెలియని దుండగులు. నిద్రిస్తున్న వ్యక్తిపై బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు దుండగులు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని కొత్తనాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కర్లకుంట గురవయ్య(71)బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంటి ఎదురుగా ఆరుబయట పడుకున్న అతడిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. గాడనిద్రలో వున్న అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్రంగా గాయపడ్డాడు. మంటల్లో చిక్కుకున్న గురవయ్య అరవడంతో కుటుంబసభ్యులు,చుట్టుపక్కల ఇళ్ల వారు వచ్చి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది. 

read more  మెర్సీ కిల్లింగ్ కోరుతూ కోర్టుకు.. ఆవరణలోనే మృతి చెందిన పదేళ్ల బాలుడు...

కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరిగి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

మృతడు గురవయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అయినవోలు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు.