Asianet News TeluguAsianet News Telugu

పేదల బతుకులతో ‘రొచ్చు బండ’

సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబాల్లో సమస్యలే లేవా. వారిలో ఎవరినైనా ఇంత వరకూ స్టూడియోలకు ఎందుకు పిలిపించలేదు.

making fun with poor people

టిఆర్పి రేటింగుల కోసం కొన్ని ఛానళ్ళు ప్రసారం చేస్తున్న కొన్ని కార్యక్రమాలు రచ్చరచ్చగా తయారవుతున్నాయి. అటివంటి కార్యక్రమాల్లో ‘రచ్చబండ’, ‘బ్రతుకు జెట్కా బండి’, ‘సంసారం ఒక చరంగం’ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు వచ్చే ప్రయోజనాలేమిటో యాజమాన్యాలే చెప్పాలి.

 

ఇటు వంటి కార్యక్రమాలకు ఏదో ఒక కుటుంబాన్ని పిలవటం వారిని ఏడిపించటం లేదా వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, అదీకాదంటే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిపై చేయిచేసుకోవటం. దాంతో అటువంటి కార్యక్రమాలు రొచ్చులాగ తయారౌతున్నాయి.  

 

ఆ మధ్య రచ్చబండ కార్యక్రమంలో ఒక కుటుంబం వచ్చింది. భార్య, భర్తల మధ్య గొడవతో వారు కార్యక్రమానికి వస్తే అది కాస్త యాంకర్ రోజాకు కార్యక్రమానికి వచ్చిన భర్తకు మధ్య గొడవగా మారింది. కార్యక్రమంలోనే రోజా సదరు వ్యక్తిపై  చేయిచేసుకున్నది. అతను కూడా రోజాను కొట్టటానికి చెయ్యి ఎత్తాడు. సదరు ఎపిసోడ్ చూస్తున్న వారంతా టివిల్లో జరుగుతున్నది చూసి ముందు విస్తుపోయి తర్వాత ఏవగించుకున్నారు.  

 

ఇదంతా చూస్తుంటే టివి యాజమన్యాలే తమ రేటింగుల కోసం కావాలనే ఇటువంటి పనులు చేయిస్తున్నట్లుగా ఉంది. టివి యాజమన్యాలు బాగుంటాయి, సెలబ్రిటీలు బాగానే ఉంటారు. మధ్యలో సమస్యల్లా కార్యక్రమంలో పాల్గొనేందకు వచ్చిన వారికే. కుటుంబం అన్నాక గొడవలనేవి సహజం. నాలుగు గోడల మధ్యో లేక అయిన వారి మధ్యో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన వివాదాలవి.

 

ఏదో ఒక కార్యక్రమానికి పేరు పెట్టి అటువంటి కుటుంబాలను వెతికి పట్టుకుని స్టూడియోల్లోకి తీసుకువచ్చి మొత్తం కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నాయి. అప్పటికి ఈ సెలబ్రెటీలేమో తాము పెద్దరాయడులైనట్లు, తమ తీర్పే సుప్రింకోర్టు తీర్పుకన్నా గొప్పదైనట్లు బిల్డప్ ఒకటి. ఈ విధంగా టివి స్టూడియోలకు పిలిపిస్తున్న కుటుంబాలన్నీ చాలా బీద కుటుంబాల్లాగానే కనిపిస్తున్నాయి. వారితో ఏ విధంగా వ్యవహరించినా అడిగే వారు లేరనేదే సెలబ్రిటీల ధైర్యం.

 

సమస్యలు లేని కుటుంబాలంటూ ఎక్కడైనా ఉంటాయా? అంతెందుకు, కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారి కుటుంబాల్లో సమస్యలు లేవా. సినిమా పరిశ్రమకు చెందిన కుటుంబాల్లో సమస్యలే లేవా. వారిలో ఎవరినైనా ఇంత వరకూ స్టూడియోలకు ఎందుకు పిలిపించలేదు. తప్పెవరిదో, ఒప్పెవరిదో తేల్చేందుకు పంచాయితీ  ఎందుకు పెట్టలేదు.

 

ఇటీవలే విడాకులకు దరఖాస్తు చేసుకున్న అమలాపాల్, రంభ కుటుంబాలను పిలిపించి పంచాయితీలు పెట్టి వారి కుటుంబాలను నిలబెట్టవచ్చు కదా? ఎవరైనా వద్దన్నారా? చిరంజీవి రెండో కూతురు వైవాహిక జీవితం కూడా ఒడిదుడుకులకు లోనైనపుడు వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఎందుకు చేయలేదు.? చేయరు. ఎందుకంటే వారి జీవితాల్లోకి వీరు తొంగిచూస్తే వీరు కూడా ఇటువంటి కార్యక్రమాలకే బాధితులుగా హాజరవ్వాల్సి వస్తుందన్న భయం.

 

పేదలంటే అందరికీ అలుసే. కాబట్టే ఏరికోరి అటువంటి కుటుంబాలనే స్టూడియోలకు తీసుకొస్తారు. వారి సమస్య తీర్చేందుకు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి పంపేస్తే ఎలాంటి గొడవా ఉండదు. కానీ వారి గొడవల్లో వీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఆ ఓవర్ యాక్షన్తోనే సమస్య వస్తోంది. ఆమధ్య, నగరంలోని ఓ పోలీసు స్టేషన్లో ఒక సెటబ్రిటీపై  ఒక మహిళ కేసు కూడా పెట్టింది. తమ కార్యక్రమంలో హాజరవ్వటానికి రావాలంటూ తనపై ఒత్తిడి పెడుతున్నారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొనటం గమనర్హం.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios