30 ఏళ్ళుగా పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్ళని కాదని పార్టీ ఫిరాయించి వచ్చిన వారిని అందలాలెక్కిస్తారా అంటూ నిలదీసారు. అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు ఎవరూ అంగీకరించటం లేదని కూడా అల్టిమేటమ్ ఇచ్చారు. జడ్పీఛైర్మన్ను మరిస్తే జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతింటుందని కూడా హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ అధినేతకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంఎల్ఏలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని చంద్రబాబునాయుడును హెచ్చరించి పార్టీలో కలకలం రేపారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని జడ్పీటిసీలు నిరసనగళం వినిపించారు. దాంతో నాయకత్వానికి ఏం చేయాలో దిక్కు తోచటం లేదు.

సమస్యేంటంటే, జడ్పీఛైర్మన్ నామన రాంబాబును పదవినుండి తప్పించాలని అధిష్టానం నిర్ణయించింది. దాంతో మెజారిటీ జడ్పిటీసీలు విభేదిస్తున్నారు. రాంబాబును దింపేయాలని ఎందుకు నిర్ణయించిందంటే జ్యోతుల నెహ్రూ కొడుకు కోసం. పార్టీ ఫిరాయింపులో భాగంగా వైసీపీ ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూతో పాటు కోడుకు జ్యోతుల నవీన్ కూడా టిడిపిలో చేరారు. అప్పటి వరకూ నవీన్ జిల్లా పరిషత్ లో ప్రతిపక్ష నేతగా ఉండేవారు.

ఫిరాయింపులో భాగంగా నవీన్ కు జడ్పీ ఛైర్మన్ పదవి అప్పగిస్తామని నెహ్రూకు-చంద్రబాబుకు ఒప్పందం కుదిరిందట. అందుకనే ఇపుడు రాంబాబును దింపేసి నవీన్ను కూర్చోబెట్టాలని నిర్ణయించారు. టిడిపిలోని 45 మంది జడ్పీటీసీల్లో 24 మంది బహిరంగంగా అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మిగిలిన వారిలో కూడా మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

24 మందికి సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కళా వెంకట్రావు, జిల్లా మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తమ నిర్ణయాన్నే ముఖ్యమంత్రికి తెలియజేయాలంటూ వారందరూ మంత్రులకే ఎదురు తిరిగారు. 30 ఏళ్ళుగా పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్ళని కాదని పార్టీ ఫిరాయించి వచ్చిన వారిని అందలాలెక్కిస్తారా అంటూ నిలదీసారు. అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు ఎవరూ అంగీకరించటం లేదని కూడా అల్టిమేటమ్ ఇచ్చారు. జడ్పీఛైర్మన్ను మరిస్తే జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతింటుందని కూడా హెచ్చరించారు. అదే విషయాన్ని మంత్రులు చంద్రబాబు చెప్పారు. ఇపుడు ఏం చేయాలో పార్టీ అధినేతకు అర్ధం కావటం లేదు.