మహిళలకు రక్షణలేకపోతే.. పురుషుల కమిషన్ పెడతారా..?

టీడీపీ నేత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారికి మహిళా సంఘాలు షాక్ ఇచ్చాయి. పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఆమె అభిప్రాయంపై మండిపడుతున్నారు. ‘‘ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? మహిళలకు రక్షణ ఉందా? చిన్న పిల్లలపై కూడా పైశాచిక దాడులు జరుగుతుంటే.... పురుషుల రక్షణ కోసం... పురుష కమిషన్‌ వేయాలా? మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారీ... ఏం మాట్లాడుతున్నారు మీరు.?’’ అని నన్నపనేనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత ప్రజాతంత్ర సంఘం, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.గంగాభవానీ, ఎం.లక్ష్మీ తదితరులు మాట్లాడుతూ నన్నపనేని రాజకుమారి పురుష సమాజానికి అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మహిళలు కూడా అకృత్యాలు చేస్తున్నారని చెప్పడం దారుణం అన్నారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన నన్నపనేని రాజకుమారి పురుష కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నన్నపనేని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.