వైష్ణవ ఆలయాల్లో లోక సంక్షేమం కోసం ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకోసం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. 

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవ ఆలయాల్లో లోక సంక్షేమం కోసం ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకోసం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది ఋత్వికులు, 100 మంది వేదపండితులు, ధర్మగిరి వేద పాఠశాల నుంచి 20 మంది వేద విద్యార్థులు పాల్గొంటారు. 

ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత పారాయణం చేస్తారు. 1958, ఆగస్టు నెలలో విళంబినామ సంవత్సరంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణకవచ తాపడం జరిగింది. సరిగ్గా 60 ఏళ్ల తరువాత అదే విళంబినామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ జరుగుతుండడం విశేషం. ఈ వైదిక కార్యక్రమం కారణంగా ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు రూ.300 టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు, దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వబడవు. విఐపి బ్రేక్‌ దర్శనాలు, ఆర్జితసేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు(వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు) రద్దయ్యాయి.