బందర్ లో అదృశ్యమైన ఓ మహిళ.. తెలంగాణలో శవమై కనిపించింది. పథకం ప్రకారం మహిళను కిడ్నాప్ చేసి.. అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మచిలీపట్నానికి చెందిన మహిళ పద్మజ(45) కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. గత నెల 31వ తేదీ తెల్లవారుజామున వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి బయటికిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు.  నుమానం వచ్చిన ఆమె భర్త ఈనెల ఒకటో తేదీన పద్మజ అదృశ్యంపై ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదీన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళను దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు మహిళ మృతదేహం పద్మజదిగా నార్కట్‌పల్లి పోలీసులు గుర్తించారు. విషయాన్ని ఇనగుదురుపేట పోలీసులకు తెలిపారు.

పద్మజ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు నార్కట్‌పల్లి పోలీసులు తెలిపిన ఆధారాల ప్రకారం మృతదేహం పద్మజదిగా గుర్తించారు. పద్మజ హత్యకు గురికావడంతో రంగంలోకి దిగిన ఇనగుదరుపేట పోలీసులు కిడ్నాప్‌ కేసుగా పరిగణనలోకి తీసుకుని అనుమానితులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. పద్మజ హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెను  దగ్గరి బంధువులు, ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.