మంత్రి పదవి దక్కకపోవడంపై తనకు ఎలాంటి బాధా లేదన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి . సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా వున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో అసమ్మతి రాగం వినిపించిన పిన్నెల్లి సైతం మెత్తబడ్డట్లు తెలుస్తుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి దక్కకపోవడంపై తనకు ఎలాంటి బాధా లేదన్నారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా వున్నట్లు పిన్నెల్లి చెప్పారు. తమ ఇద్దరి మధ్యా రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు.
కాగా... ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు దక్కలేదని అసంతృప్తితో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే Pinnelli Ramakrishna Reddyని బుజ్జగించేందుకు YCP నాయకత్వం రంగంలోకి దిగింది. Macherla నియోజకవర్గం నుండి ఈ దఫా తనకు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భావించారు. కానీ పిన్నెల్లికి ఈ దఫా అవకాశం దక్కలేదు. దీంతో మాచర్ల నియోజకవర్గంలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రకటించారు.
అంతేకాదు.. CMO లో సీఎం సెక్రటరీగా పనిచేస్తున్న Dhanjaya Reddy ఆదివారం నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారు. అయితే ఈ ఫోన్ కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సరిగా స్పందించకుండానే ఫోన్ పెట్టేశారని సమాచారం. దీంతో ఆయనను ఇవాళ తాడేపల్లికి రావాలని వైసీపీ నాయకత్వం ఆదేశించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడాలని ఏపీ మంత్రి Peddireddy Ramachandra Reddyని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది.
