గతంలో ఎన్నడూ లేనంతగా జన్మభూమి కార్యక్రమంలో గందరగోళం రేగుతోంది. కార్యక్రమం మొదలైన రోజు నుండి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే వరస కనిపిస్తోంది. పోయిన జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన హామీల గురించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో నేతలకు, అధికారలకు దిక్కుతోచటం లేదు.

చంద్రబాబునాయుడు పాల్గొంటున్న కార్యక్రమాల్లో కూడా ఈ విషయం స్పష్టంగా కనబడుతోంది. కాకపోతే సిఎం అన్న హోదాలో ఉన్నారు కాబట్టి పటిష్టమైన భద్రత మధ్య చంద్రబాబు పాల్గొంటున్నారు. చంద్రబాబు పాల్గొంటున్న కార్యక్రమాల్లోని ప్రాంతాల్లో పోలీసులు ముందుస్తుగానే వైసిపి నేతలను అదుపులో తీసుకుంటున్నారు. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలకైతే జనాల సెగ తప్పటం లేదు. నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, మదనపల్లి, గుంటూరు లాంటి చోట్ల జనాలు ఏకంగా ప్రజాప్రతినిధులపైనే తిరగబడుతున్నారు.

కడప జిల్లా తొండూరు మండలంలోని ఇనగలూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంఎల్సీ సతీష్ రెడ్డిపై జనాలు తిరగబడ్డారు. ప్రభుత్వ కార్యక్రమమైన జన్మభూమిలో పాల్గొన్న సతీష్ తో మాట్లాడుతూ ‘ ఏహోదాతో కార్యక్రమంలో పాల్గొన్నారో చెప్పాలి’ అంటూ నిలదీసారు. దాంతో కొద్దిసేపు జనాలతో వాదించిన సతీష్ చేసేది లేక అక్కడి నుండి వెళ్లిపోయారు. విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరిని జనాలు రోడ్డుపైనే నిలదీసారు. గిడ్డికి జనాలకు మధ్య పెద్ద వాగ్వాదమే జరగటంతో వాళ్లకి సమాధానం చెప్పలేక చివరకు గిడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు.

ఇక, మదనపల్లిలో అయితే, విద్యార్ధులకు బిటి కళాశాల యాజమాన్యానికి పెద్ద గొడవే అయింది. జన్మభూమి లో పాల్గొనాలని యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలపై విద్యార్ధులు తిరగబడ్డారు. కార్యక్రమంలో పాల్గొనని విద్యార్ధులకు టిసిలు ఇస్తామని యాజమాన్యం బెదిరించటంతో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా విద్యార్ధులు కళాశాలను బహిష్కరించి అందరికీ టిసిలు ఇచ్చేయమనటంతో యాజమాన్యానికి దిక్కుతోచలేదు.

గుంటూరులో జరిగిన కార్యక్రమంలో టిడిపి-భాజపా నేతల మధ్య పెద్ద గొడవే అయింది. కేంద్రం విడుదల చేస్తున్న నిధులతో పథకాలు అమలు చేస్తూ ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టరా అంటూ భాజపా నేతలు టిడిపి నేతలను నిలదీశారు. దాంతో రెండు పార్టీల నేతల మధ్య జనాల ముందే పెద్ద వాగ్వాదం  జరిగింది. మొత్తం మీద హామీల అమలుపై జనాలు ప్రజాప్రతినిధులను నిలదీయటం శుభసూచకమే.