ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇవి తగ్గకపోగా.. మరింత పెరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో రామాలయంపై దాడి చేశారు దుండగులు.

డోన్ మండలం వెంకట్రాయుని పల్లెలో రామాలయం నిర్మాణంలో వుంది. ఆ ఆలయంలోని రాతి స్తంభాలను ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

కాగా డిసెంబర్ 28న అర్ధరాత్రి సమయంలో రామతీర్థం కొండపైన ఉన్న ఆలయంపై దాడి చేసిన దుండగులు కోదండరాముడి విగ్రహ శిరస్సు భాగాన్ని తొలగించడం సంచలనం రేపింది. హాక్సా బ్లేడుతో విగ్రహాన్ని ధ్వంసం చేసి శిరస్సు భాగాన్ని ఆలయం పక్కనే ఉన్న రామకొలనులో పడేశారు.

ఆలయంపై దాడికి నిరసనగా రాజకీయ పార్టీలు నీలాచలం కొండవద్ద ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజసాయి రెడ్డి ఒకేరోజు ఆలయాన్ని సందర్శించడంతో వాతావరణం వేడెక్కింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించగా.. పోలీసులు ఇప్పటివరకు 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే విగ్రహ ధ్వంసానికి వినియోగించిన రంపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులనైతే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంతవరకు అసలు నిందితులను పట్టుకోలేదు.