ఆంధ్ర రాజధాని సమీపంలో ఒక శివాలయం మాయమయింది.శివుడిని, అమ్మావారిని, నవగ్రహాలను ఎత్తుకెళ్లి దూరాన కొండమీద ఒకషెడ్డులో పడేశారు. ఇదంతా క్వారీ కోసమేనని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
వారం కిందట ఇక్కడో శివాలయం ఉండేది. 1966 లో కోటి రుపాయలు పెట్టి అభివృద్ధిచేసిన ఈ గుడి రాత్రికి రాత్రి ఇలా మాయమయింది.
గుడిని మాయం చేశారు. లింగాన్ని తరలించేశారు. గుట్టుచప్పుడు కాకుండా గుడిలోని విగ్రహాలను రాత్రిరాత్రికి ఉన్నచోటునుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండమీదికి తీసుకువెళ్లి, ఒక షెడ్డు వేసి అందులో పడేశారు. శివలింగం, నవగ్రహాలు, అమ్మవారి విగ్రహం ఒక మూలన పడివున్నాయిపుడు. కార్తీక మాసంలో శివుడికి ఈ కష్టాలు రావడానికి కారణం, అధికారంలో ఉన్నవాళ్ల అండతో శివాలయం దగ్గిర క్వారి తవ్వాలనుకోవడమే నని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
ఈ అపచారం జరిగింది గన్నవరం మండలం చిక్కవరంలో. అక్రమణకు బలయింది అక్కడి జగబ్రహ్మయ్య లింగేశ్వర ఆలయంలోని శివాలయం. నిరాశ్రయుడయింది అక్షరాల పరమ శివుడు.
పదేళ్ల క్రితం గ్రామస్తులు, దాతల సహకారంతో జగద్గురువులు జయేంద్ర సరస్వతి శివాలయంలో అమ్మవారు, నవగ్రహాలను ప్రతిష్టించారు. చెట్టు నీరు కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెరువు ఒడ్డున ఉన్న ఆలయాన్ని సందర్శించి అక్కడి వాతావరణం చూసి ముచ్ఛటపడి, ఇక్కడ టూరిజం అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. గ్రామస్థులుచాలా సంతోషించారు.
ఇపుడు గ్రామస్థులతో సంబంధం లేకుండా, దేవాదాయ శాఖ వారికి చెప్పకుండా ఎవరో గుడిని ధ్వంసం చేసి, శివలింగాన్ని, అమ్మవారిని, నవగ్రహాలను తీసుకెళ్లి దూరాన కొండ మీద ఒక షెడ్డులో పడేశారు. ఎందుకిలా చేశారు, ఇపుడు ఉన్నపలాన తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేవి గ్రామస్థులను వేధిస్తున్న ప్రశ్నలు. ఈ చర్య గ్రామానికి అరిష్టమని స్థానికులు భయపడుతున్నారని ఆ వూరిని సందర్శించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ’ఏషియానెట్‘ కు తెలిపారు.
ఆలయ సమీపంలో కొండ పోరంబోకు, రిజర్వుఫారెస్టు ప్రదేశంలో రోడ్లు నిర్మిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తున్నదని, ఇదే క్వారీయింగ్ సంబంధించిన వ్యవహారంగా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
‘ఓబుళాపురం గనుల విషయంలో సుంకులమ్మ అమ్మవారిని కూల్చివేసిన వారికి ఎటువంటి గతి పట్టిందో లోకమంతటికీ తెలుసు. వెనవెంటనే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు అదేశించాలి. విగ్రహాలను తొలగించిన నిర్వాహకులను అరెస్టు చేయాలి. తొలగించిన శివలింగాన్ని యాధాస్థానంలో ప్రతిష్టించాలి,‘అని శివాజీ ప్రభుత్వాన్ని కోరారు.మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర బాలవర్దన్ రావు కూడా ఈ చర్యను నిరసించారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడ ఈగుడి ఉన్న ప్రదేశాన్ని, కొండ మీద ఉన్న షెడ్డున సందర్శించారు, గుడిని యధాస్థానానికి తెచ్చే దాకా వదలమని ఆందోళన చేస్తామని వారు చెబుతున్నారు.
