‘ఇల్లు కట్టాలి అంటే ఎంత కష్టమో నాకు సొంత ఇల్లు కట్టుకున్నపుడు తెలిసింది’..ఇది తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు.  నెల్లూరు టౌన్ లో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లను సోమవారం లోకేష్ పరిశీలించారు. పేద ప్రజలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత నాణ్యమైన ఇల్లు కడుతుంది అని తన జీవితంలో ఊహించలేదట. అలాంటిది షేర్ వాల్ టెక్నాలజీతో పేద ప్రజలకు  అద్భుతమైన ఇల్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

నెల్లూరు టౌన్ లో ఒకే చోట నిర్మిస్తున్న 5 వేల ఇళ్ళల్లో 20 వేలమంది ఉండొచ్చట.  ముఖ్యమంత్రి ఎప్పుడు చూసినా సింగపూర్ గురించి మాట్లాడటాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్లి పడుకోరట, షాపింగ్ చెయ్యరట. మరేం చేస్తారంటే, అక్కడ పేదప్రజల కోసం ఎటువంటి టెక్నాలజీతో ఇళ్ళు కడుతున్నారో చూస్తారట. రోడ్లను ఎలాంటి టెక్నాలజీతో రోడ్లు శుభ్రం చేస్తున్నారో తెలుసుకుంటారట.

అంతా బాగానే ఉంది కానీ, ఇల్లు కట్టుకోవటంలో కష్టాలేంటో తనకు తెలుసనటమే పెద్ద జోక్ లాగుంది. ఈయన ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొదటిసారి చంద్రబాబునాయుడు ఇల్లు కట్టినపుడు లోకేష్ చాలా చిన్న పిల్లాడు. రెండోసారి ఇల్లు కట్టినపుడు చంద్రబాబు సిఎం హోదాలో ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఇల్లు కట్టుకుంటుంటే లోకేష్ కష్టపడేదేముంటుంది?

ఏదేమైనా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి మాటలు ఇంకా ఎన్ని వినాలో? లక్షలాది ఇళ్ళు, లక్షలాది ఉద్యోగాలు ఇలా చాలానే చెప్పారు మంత్రి. పనిలో పనిగా వైసిపిని విమర్శకుండా ఉండరు కదా? ఆ ముచ్చట కూడా తీర్చేసున్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య ప్రతిపక్షం చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. కాపులను బిసిల్లోకి చేరుస్తానని హామీ ఇచ్చిందెవరో మంత్రి మరచిపోయినట్లున్నారు.