‘ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుంది’ అన్న సామెతను నారా లోకేష్ నిజం చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ‘ తాము వేసిన రోడ్ల మీదే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు’ అంటూ చెప్పారు.  సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో లోకేష్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అదే రకమైన వ్యాఖ్యలను చంద్రబాబునాయుడు గతంలో చేసినపుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

నంద్యాల ఉపఎన్నిక ముందు చంద్రబాబు జనాలతో బహిరంగంగా మాట్లాడుతూ, ‘తాము వేసిన రోడ్లపై నడుస్తూ, తామిస్తున్న పెన్షన్లు తీసుకుంటూ, తామిచ్చే రేషన్ తీసుకుంటూ తమకు ఎందుకు ఓట్లు వేయరం’టూ జనాలను నిలదీయటం అప్పట్లో పెద్ద సంచలనమైంది. అప్పటికేదో వేసిన రోడ్లు, ఇస్తున్న పెన్షన్లు, రేషన్ అంతా తన జేబులో నుండి ఇస్తున్నంత బిల్డప్ ఇచ్చారు చంద్రబాబు.

తాజాగా లోకేష్ కూడా చంద్రబాబు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. తామేసిన రోడ్లపైనే జగన్ పాదయాత్ర  చేస్తున్నారంటూ చెప్పటం విచిత్రంగా ఉంది. ఇపుడంటే జగన్ చేసే పాదయాత్ర టిడిపి వేసిన రోడ్లమీద జరుగుతోంది ఓకే. మరి అప్పట్లో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు కదా? అప్పుడు కాంగ్రెస్ వేసిన రోడ్లపైనే చంద్రబాబు పాదయాత్ర చేసినట్లు లోకేష్ ఒప్పుకుంటారా?