ఒక్క లోకేష్ విషయంలోనే కాదు గతంలో చంద్రబాబు నోటి నుండి కూడా ఎన్నో ఆణిముత్యాలు జాలువారిన సంగతి ఎలా మరచిపోగలం? ఇక, నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా రిపీట్ అవుతోంది.

చంద్రబాబునాయుడుకు లోకేష్ పెద్ద తలనొప్పిగా మారాడు. ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూడా లోకేష్ కు తెలీటం లేదు. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతున్నాడు. ఫలితంగా నవ్వుల పాలవుతున్నాడు. తనలో లోపాలు పెట్టుకుని సోషల్ మీడియాను నియంత్రించాలని చూడటం అవివేకమే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనలోమాట్లాడుతూ, తాగునీటి సమస్య సృష్టించటమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. లోకేష్ ప్రకటన వినగానే సభికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లోకేష్ ఉద్దేశ్యం తాగునీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పటం. కానీ చెప్పింది ఇంకోటి. ఇదే మొదటిసారి కాదు.

గతంలో ఓసారి మాట్లాడుతూ, ‘దేశంలో మత పిచ్చి, కుల పిచ్చి, అవినీతి, బంధుప్రీతి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశమే’ అని చెప్పి అందరినీ అశ్చర్య పరిచారు. మొన్నటికి మొన్న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు తెలిపటంతో అందరూ అవాక్కయ్యారు. అంటే లోకేష్ కు జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలీదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.

నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న లోకేష్ తనంతట తానుగా జనాల్లో నవ్వుల పాలౌవుతున్నారు. గతంలో ఒకసారి వారసత్వంపై చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, వారసుడి హోదాలో ఉన్నంత మాత్రాన ప్రజలు మెచ్చరని సామర్ధ్యం కూడా ఉండాలంటూ పెద్ద సుద్దులు చెప్పారు. తర్వాత కాలంలో మెల్లిగా లోకేష్ ను మొదట పార్టీపైన రుద్దారు. తాజాగా ఎంఎల్సీని చేసిన వెంటనే మంత్రిగా అందలం ఎక్కించారు. అంటే దీని అర్ధమేమిటి? లోకేష్ విషయంలో అర్హతలకన్నా వారసత్వమే ఎక్కువ పనిచేసిందన్న విషయం స్పష్టమవుతోంది.

సినిమా నటులు వారసులను ఫీల్డ్ లోకి తేవాలంటే ముందునుండీ అవసరమైన ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఫైనల్ గా ఏదో ఒక ముహూర్తంలో తెరపైకి తెస్తారు. రాణిస్తాడు లేకపోతే లేదు. కానీ రాజకీయాల్లో అలాకాదు. సామర్ధ్యం లేకపోయినా వారసుడి హోదాలో గట్టి పునాదులుంటే చాలు ఇంకేమి అవసరం లేదని లోకేష్ ను చూస్తుంటే అర్ధమవుతోంది. పైగా చంద్రబాబు ఉన్నంత వరకూ లోకేష్ ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతుంది. ఇష్టమున్నా లేకపోయినా పార్టీలోని నేతలు భరించాల్సిందే.

ఇది ఒక్క లోకేష్ విషయంలోనే కాదు నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా రిపీట్ అవుతోంది. బహిరంగ సభల్లోనూ, మీడియాతోనూ మాట్లాడేటప్పుడు బాలకృష్ణ ఎంత ఇబ్బంది పడుతుంటారో అందరికీ తెలిసిందే. అంటే స్క్రిప్ట్ లేకుండా ఒక్క నిముషం కూడా సొంతంగా బాలకృష్ణ మాట్లాడలేరన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. బహుశా మాట్లాడటంలో లోకేష్ కు మేనమామ కమ్ మావగారి పోలికలే వచ్చాయేమో. నోటిని అదుపులో పెట్టుకోలేని లోకేష్ సోషల్ మీడియాను అదుపులో పెట్టాలని అనుకోవటం విచిత్రంగా లేదూ?