లాక్ డౌన్: వైఎస్ జగన్ కు టైమ్ ఇచ్చిన పవన్ కల్యాణ్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం పట్ల అనుసరించాల్సిన వైఖరిని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊరట కలిగించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని ఆయన తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా సూచించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.
లాక్ డౌన్ తర్వాతనే రాజకీయాలు మాట్లాడుదామని, ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేద్దామని పవన్ కల్యాణ్ చెప్పారు. గురువారం ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసి) సభ్యులతో, ప్రధాన కార్యదర్శులతో, కార్యదర్శులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా సమయంలో రాజకీయాలు చేయడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదని ఆయన చెప్పారు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలని ఆయన సూచించారు.
లాక్ డౌన్ పొడగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉందని, దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలో ప్రణాళిక అమలు చేద్దామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సలహాలు ఇస్తూనే ఉన్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. తెలుగుదేశం (టీడీపీ) నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ స్థితిలో పవన్ కల్యాణ్ తీసుకోవడం గమనార్హం.