న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్వరూపానందేంద్ర స్వామి మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలపై శాసనసభ స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనపై ఎంపీ సంజీవ్ కుమార్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 

జగన్ కు ఇది లిట్మస్ టెస్టు అని రఘురామ కృష్ణమ రాజు బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ ఇస్తారా, లేదా అనేది జగన్ కు లిట్మస్ టెస్టు అని ఆయన అన్నారు. డిక్లరేషన్ ఇవ్వాలని గంగలో ముంచినవారు జగన్ కు సలహా ఇవ్వాలని ఆయన స్వరూపానందేంద్ర స్వామిని ఉద్దేశించి అన్నారు. హిందూ దేవుళ్ల మీద నమ్మకం ఉంటే జగన్ సంతకం చేయాలని అన్నారు. హిందువుల రక్షకుడిగా ఉంటాడని అనుకున్నవాడు హిందువుల భక్షకుడిగా మారాడని ఆయన అన్నారు.

జగన్ ను స్వరూపానందేంద్ర గంగలో ముంచి హిందువులకు రక్షణగా ఉంటాడని చెప్పాలని ఆయన అన్నారు. స్వరూపానంద పాత్ర చాలా ఉందని ఆయన అన్నారు. జగన్ కు స్వరూపానంద హితోపదేశం చేయాలని ఆయన అన్నారు. హిందూ దేవుళ్లపై మీకు నమ్మకం ఉందని మీ బాబాయ్ చెప్పినట్లు ఉంటే ఒక సంతకం చేయాలని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. 

జగన్ మౌనం బద్దలైతే ప్రళయం వస్తుందని తమ్మినేని అంటున్నారని ఆయన గుర్తు చేస్తూ జగన్ మౌనం కాదు, ప్రజల మౌనం బద్దలైతే ప్రళయం వస్తుందని రఘురామకృష్ణమ రాజు అన్నారు. తెలుగు భాషను జగన్ భూస్థాపితం చేస్తున్నారని, తెలుగు భాషను వదిలేసి ఇంగ్లీషు కోసం పాకులాడుతున్నారని ఆయన అన్నారు. తమకూ భద్రత ఉందని ఆయన చెప్పారు. కడప వెళ్లాక కర్నూలు వస్తానని, ఏం చేస్తారో చూస్తానని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని ఆయన అన్నారు .

వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ మితభాషి అని, ఆయన కూడా సవాల్ చేస్తున్నారని రఘురామ అన్నారు. ఒక సామాజిక వర్గాన్ని తుదముట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వందల కేసులు నడుస్తున్నాయని ఆయన అన్నారు. తన బాగోతాలు బయటపడుతాయని అంటున్నారని, వారి బాగోతాలూ కూడా బయటపడుతాయని ఆయన అన్నారు.చూసుకుందామంటే చూసుకుందామని ఆయన అన్నారు. మీ నాయకులుకున్నన్ని బాగోతాలు తనకు లేవని ఆయన అన్నారు. 

తాను బ్యాంకులకు చెల్లించాల్సింది ఉందని, అంతకన్నా రెట్టింపు తనకు రావాల్సింది ఉందని ఆయన అన్నారు. మాట్లాడితే రాజీనామా చేయాలని అంటున్నారని, తాను తన బొమ్మతోనే గెలిచానని, తన బొమ్మ చూసే తనకు ఓటేశారని ఆయన అన్నారు. పార్టీకి తన రక్తం ధారపోశానని, ఎమ్మెల్యేకు కూడా రక్తం ధారపోశానని, తన రక్తం తనకు ఇవ్వాలని ఆయన అన్నారు. 

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరపాలని జగన్ అడుగుతున్నారని, దాని గురించే తాను పార్లమెంటులో మాట్లాడుతుంటే మాట్లాడడానికి వీల్లేదని అంటున్నారని. తోలు తీసేస్తామని హెచ్చరిస్తున్నారని ఆయన అన్నారు. నా ఊరు వెళ్తే నన్ను చంపేస్తారా అని ఆయన అడిగారు. న్యాయవ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఏపీ హైకోర్టు ఉంది కాబట్టి ప్రజలు ధైర్యంగా బతుకగలుగుతున్నారని ఆయన అన్నారు. పలికేదేవరైనా పలికించేదెవరో కనిపెట్టి భరతం పట్టాలని ఆయన హైకోర్టును కోరారు. 

150 మంది ప్లస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు దాడి చేస్తారని నిఘా విభాగం గ్రహించి ఉంటుందని, తనకు వస్తున్న బెదిరించిన ఫోన్ కాల్స్ ను గమనించి ప్రభుత్వం అండదండలున్నాయని గమనించింది కావచ్చునని, అందుకే తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించిందని, ఆ భద్రతను తీసేయరని ఆయన అన్నారు.