మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.ఏపీలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా మద్యం వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు వెళ్ళాలని నిర్ణయించారు. తమకు ఇచ్చే ట్రేడ్‌ మార్జిన్‌ను 16శాతానికి పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25 నుంచి నిరవధికంగా మద్యం దిగుమతులు నిలిపివేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. షాపులు, బార్లలో ఉన్న నిల్వలు అయిపోయిన వెంటనే అమ్మకాలు ఆగిపోనున్నాయి.

అమ్మకాలు లేకపోయినా షాపులు, బార్లు తెరిచే ఉంచుతామని వ్యాపారులు చెప్పారు. ఏపీ రాష్ట్ర వైన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ శనివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేశారు. సంఘం అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల నుంచీ వ్యాపారులు పాల్గొన్నారు. మద్యం వ్యాపారం వల్ల నష్టం వస్తోందన్న విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రయోజనం లేనందున బంద్‌కు వెళ్ళాలని సమావేశం అభిప్రాయపడింది.

ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా బంద్‌చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం ఉంటుందని, అప్పుడే న్యాయం జరుగుతుందని భావించి ఆమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం అధ్యక్షుడు రాయల సుబ్బారావు విలేకరులతో మాట్లాడుతూ 2017 జూన్‌ వరకు మద్యం అమ్మకాల్లో మార్జిన్‌ సగటున 21శాతం ఉండేదని, దానిని ఈ పాలసీలో 10 శాతానికి తగ్గించారని వివరించారు. లైసెన్సు ఫీజులు తగ్గించారన్న కారణంతో మార్జిన్‌ను తగ్గించామని అధికారులు చెబుతున్నారని తెలిపారు.

కానీ దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. 2017 మార్చి 31న డ్రా నిర్వహించి, లైసెన్సు ఫీజులు కట్టించుకుని అదే రోజున లైసెన్సులు ఇచ్చారనీ, రెండు నెలల తర్వాత మార్జిన్‌ తగ్గించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒకసారి ఒప్పందం అమల్లోకి వచ్చాక నిబంధనలను మార్చడం కుదరదని అని చెప్పారు. మార్జిన్‌ను పెంచాలన్న డిమాండ్‌ను అధికారులు పట్టించుకోకపోవటంతో గత్యంతరం లేకనే బంద్‌కు వెళ్తున్నామని, ప్రభుత్వాన్ని బెదిరించాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు.