Asianet News TeluguAsianet News Telugu

కాకరేపుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మీడియా నిషేధంపై స్పీకర్‌ కు చంద్రబాబు లేఖ

ఏపీ అసెంబ్లీలో మీడియాపై ఆంక్షల పెట్టడం మీద స్పీకర్ తమ్మినేనికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల్లో లేని ఆంక్షలు మీడియాపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

Lift curbs on media outfits, Chandrababu Naidu urges Thammineni - bsb
Author
Hyderabad, First Published Nov 30, 2020, 1:16 PM IST

ఏపీ అసెంబ్లీలో మీడియాపై ఆంక్షల పెట్టడం మీద స్పీకర్ తమ్మినేనికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాల్లో లేని ఆంక్షలు మీడియాపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకపోవడం, మీడియా పాయింట్‌ను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామికం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 

ఆదివారం ఆయన దీనిపై శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఒక లేఖ రాశారు. ‘‘ప్రజా సమస్యలపై చట్ట సభల్లో జరిగే చర్చలను ప్రజలకు చేర్చడంలో మీడియా పాత్ర కీలకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఆదేశిస్తూ గతంలో ఈ ప్రభుత్వం జీవో 2430 జారీచేసింది. ఇప్పుడు చట్ట సభల్లోకి మీడియాను అనుమతించకపోవడం అంతకంటే దారుణమైన చర్య’’ అని లేఖలో పేర్కొన్నారు. 

చట్ట సభల్లో చర్చలను, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిని ప్రజలకు చేర్చిన ఘనత టీడీపీదేనని, 1998లో దేశంలో మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం చట్ట సభల కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసిందని పేర్కొన్నారు. దీని కొనసాగింపుగా పార్లమెంటులో కూడా ఇదే తరహా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించారని తెలిపారు.

అయితే ఇప్పుడు మీడియాపై ఇలా నిషేధం విధించడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. కాగా, శాసనసభ సమావేశాల కవరేజికి ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5లను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. 

‘సభా ప్రాంగణంలోకి రాకూడదు. కెమెరాలు తీసుకురాకూడదు. గ్యాలరీలోకి వెళ్లకూడదు. లాబీల్లో తిరగరాదనే ఆంక్షల విధింపు పార్లమెంటరీ వ్యవస్థను కించపరచడమేనని, శాసనసభ సమావేశాల్లో దీనిని ప్రధానాంశంగా చేపడతామన్నారు. దీనిపై శాసనమండలిలోని ఇతర పార్టీల ప్రతినిధులను కలిసి రావాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై యనమల మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్ కు లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios