తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుతపులి మంగళవారం నాడు దాడికి పాల్పడింది. అయితే తృటిలో వాహనదారులు ఈ దాడి నుండి తప్పించుకొన్నారు. 

అలిపిరి నుండి 4వ కిలోమీటరు వద్ద ఇద్దరు వాహనదారులపై చిరుతపులి దాడికి పాల్పడింది.  అయితే చిరుత పులి నుండి తృటిలో తప్పించుకొన్న ఆ ఇద్దరు వాహనదారులు వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పెట్రోలింగ్ వాహనాన్ని పంపారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనం మూసివేసిన సమయంలో పలు జంతువులు తిరుమల వీధుల్లో సంచరిస్తున్నట్టుగా సీసీటీవీ దృశ్యాల్లో కన్పించాయి.

తిరుమల వీధుల్లో ఎలుగు బంటి, చిరుత పులి వంటి జంతువులు కూడ దర్శనమిచ్చాయి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షల మినహాయింపు నేపథ్యంలో తిరుమలలో భక్తులకు వెంకన్న దర్శనం కల్పించారు. 

దీంతో ఇటీవల కాలంలో జంతువులు తిరుమల వీధుల్లోకి రావడం మానేశాయి. అయితే తిరుమలకు వెళ్లే దారిలో కూడ పలు మార్లు చిరుతతో పాటు ఇతర జంతువులు కన్పించాయని పలువురు అర్చకులు, టీటీడీ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.అయితే ఇవాళ ఏకంగా చిరుత పులి బైక్ పై వెళ్తున్నవారిపై దాడికి దిగడంతో విజిలెన్స్ విభాగం అధికారులు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.