తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో మరోసారి మోసాలు వెలుగుచూశాయి. అసలే కరోనాతో జనం అల్లాడుతుంటే పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు.

ఈ క్రమంలో తిరుపతిలో లీగల్ అండ్ మెటరాలజీ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాహనదారులు లీటర్ పెట్రోల్ పోయించుకుంటే రీడింగ్ చాలా చూపించినా.. బంకు యజమానులు అమర్చిన చీప్ వల్ల 40 మిల్లీలీటర్లు తక్కువ వస్తోంది.

ఇది తెలియక ఎంతోమంది వినియోగదారులు మోసపోతున్నారు. ఈ చిప్‌ను తమిళనాడులోని వేలూరు నుంచి తెచ్చి అమర్చినట్లుగా తిరుపతిలోని ఓ బంక్ యజమాని చెప్పాడు. ఇలా రాష్ట్రంలోని పలు బంకుల్లో ఈ చిప్ అమర్చినట్లు చెప్పడంతో లీగల్ అండ్ మెటరాలజీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులపై విజిలెన్స్, పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో తక్కువ పెట్రోల్ వచ్చే విధంగా ఎలక్ట్రానిక్ చిప్స్ అమర్చుతున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

ముఠా సభ్యులు ఇచ్చిన సమాచారంతో జిల్లా వ్యాప్తంగా ఏడు పెట్రోల్ బంకుల్లో ఈ చిప్స్ అమర్చినట్లుగా విజిలెన్స్, పోలీసులు తనిఖీలు చేపట్టారు.  విజయవాడలోని పెట్రోల్ బంకులపైనా టాస్క్‌ఫోర్స్, లీగల్ మెటరాలజీ, విజిలెన్స్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. పెట్రోల్ కొలతల్లో దాడులు వస్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.