అధికారం వచ్చి రెండున్నరేళ్ళవుతున్నా భాజపా నేతల్లోనే కాకుండా కొత్తగా చేరిన వారిలో కూడా అత్యధికులు దిక్కు, మొక్కు లేకుండా పడివున్నారు.
రాష్ట్రంలో కమలంపార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. దాంతో కమలం రేకులు రాలిపోవటం ఖాయంగా తేలుతోంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరిన నేతల్లో కొందరు, ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్న నేతల్లో అనేకులు త్వరలో వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎప్పుడు చేరుతారు అన్నదే సస్పెన్స్.
గడచిన రెండున్నర ఏళ్ళ తెలుగుదేశం పార్టీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రపక్షం భాజపా నేతల్లో కూడా అసంతృప్తి తీవ్రంగానే ఉంది. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉంటూ, రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న ఆనందం చాలా మంది కమలనాధుల్లో కనబడటం లేదు.
అధికారం వచ్చి రెండున్నరేళ్ళవుతున్నా భాజపా నేతల్లోనే కాకుండా కొత్తగా చేరిన వారిలో కూడా అత్యధికులు దిక్కు, మొక్కు లేకుండా పడివున్నారు.
ఫలితంగా అసంతృప్తి అనేది పార్టీలో చేరిన వారిలోనే కాదు పార్టీ నేతల్లో కూడా పెరిగిపోతోంది. అయితే, వివిధ కారణాల వల్ల బయటకు పొక్కటం లేదు. చాలా మందిలో ఉన్న ఏకాభిప్రాయమేమిటంటే భాజపా ఎదుగుదల టిడిపి పిడికిట్లో నలిగిపోతోందని. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఒంటరిగా ఎదగటంకాదు, ఇప్పుడున్న సీట్లు వస్తాయన్న నమ్మకం కూడా సడలిపోయింది.
ఇటువంటి అనేక కారణాల వల్ల కమలంపార్టీలో ఎంతో కాలం కొనసాగలేమన్న విషయాన్ని కొత్త కమలనాధులు గ్రహించారు. అటువంటి వారిలో ఎక్కువ మంది వైసీపీ తప్ప వేరే దారి లేదన్న వాస్తవాన్ని కూడా తెలుసుకున్నట్లు సమాచారం. క్షేత్రస్ధాయి పరిస్ధితులను చూస్తూ టిడిపిలో చేరలేక పోతున్నారు. ఇక, కాంగ్రెస్ గురించి ఆలోచించటం కూడా లేదు. జనసేన అన్నది ప్రస్తుతానికైతే చుక్కాని లేని పడవే.
కాబట్టి వైసీపీలో చేరటమొకటే దారని చాలా మంది గ్రహించారు. ఇటు వైసీపీ, అటు భాజపాలో చేరిన హస్తం గుర్తు నేతలు, కాంగ్రెస్ నేతల్లో చాలా మందికి కావాల్సిన ఓ ఆప్తమిత్రుని ద్వరానే మాటా, మంతి జరిగినట్లు తెలిసింది. భాజపా, కాంగ్రెస్ ల్లో నుండి వచ్చేసే వారిలో వారడిగిన ఎంపి, ఎంఎల్ఏ స్ధానాలు ఇవ్వటానికి జగన్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాబట్టి ఆయా పార్టీలకు బై బై చెప్పటానికి ఎవరికి వారు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. అంటే త్వరలో కమలంపార్టీ కుదేలవ్వటం ఖాయమేనేమో.
