వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం భార్య అంగీకారంతో మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీని ఎట్టి పరిస్ధితుల్లోనూ అరెస్ట్ చేయాలని లాయర్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. 

సుబ్రమణ్యం కుటుంబంతో బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని లాయర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. వారు పోస్ట్‌మార్టం నిమిత్తం ఒప్పుకోవడం లేదన్నారు. ప్రస్తుతం స్టేట్‌మెంట్ తీసుకుంటున్నారని.. కనీసం కారులో మృతదేహాన్ని తరలించినందుకైనా ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేయాలని లాయర్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. అటు ఏపీ పోలీసుల‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య అనిత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అతని మృత‌దేహం పోస్టుమార్టానికి అనుమ‌తి ఇస్తూ సంత‌కం పెట్టాల‌ని త‌న‌పై పోలీసులు ఒత్తిడి తీసుకువ‌స్తున్నార‌ని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హిళా పోలీసుల‌తో త‌న‌ను కొట్టిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఓ వాయిస్ మెసేజ్‌ను ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌కు పంపింది. సుబ్ర‌హ్మ‌ణ్యం మృత‌దేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోవాలంటూ అనిత‌తో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాల‌యానికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.

అంతకుముందు సుబ్రమణ్యం భార్యను (subramaniyam dead body) మార్చురీ వద్దకు బలవంతంగా తీసుకొచ్చారు పోలీసులు. వ్యాన్ నుంచి కిందకి దిగిన సుబ్రమణ్యం భార్య తలను నేలకేసి బాదుకుంది. మార్చురీ వద్దకు దళిత సంఘాలు చేరుకోవడంతో గేటుకు వాహనాలను అడ్డుగా పెట్టారు పోలీసులు. భార్య అంగీకారంతో పోస్ట్‌మార్టం (post mortem) నిర్వహించేందుకు యత్నిస్తున్నారు. 

అయితే సుబ్రమణ్యం తల్లిదండ్రులు మాత్రం పోస్ట్‌మార్టంను వ్యతిరేకిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం జరిగితే తప్ప కేసు ముందుకు కదలని పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా సంతకం చేయిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంతకం పెట్టేందుకు సుబ్రమణ్యం భార్య నిరాకరిస్తోంది. 

ALso Read:బలవంతంగా పోస్ట్‌మార్టానికి యత్నం: సంతకం పెట్టేందుకు సుబ్రమణ్యం భార్య ససేమిరా, తలను నేలకేసి కొట్టుకుని

కాగా.. తన మాజీ డ్రైవర్ మృతి కేసులో (subramanyam dead body) ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు (ysrcp mlc ananthababu) పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన అరెస్ట్ కోసం నిన్నటి నుంచి డ్రైవర్ కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీపై ఈ స్థాయిలో ఆరోపణలు వస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని.. అతను ఎక్కడున్నాడో తెలిసి వదిలేస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి డ్రైవర్ సుబ్రమణ్యం చనిపోతే.. శుక్రవారం రెండు పెళ్లిళ్లకు హాజరయ్యారు ఎమ్మెల్సీ అనంత బాబు. పెళ్లిళ్లలో పాల్గొనడమే కాకుండా దర్జాగా ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో (ggh kakinada) ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దళిత ప్రజా సంఘాలు, పలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం మృతదేహం ఉన్న కాకినాడ జీజీహెచ్ వద్దకు తెలుగుదేశం పార్టీ (telugu desam party) ఏర్పాటు చేసిన నిజ నిర్దారణ బృందం (fact finding committee) వెళ్లింది.