Asianet News TeluguAsianet News Telugu

చట్టం బాగా పనిచేస్తోంది....ప్రతిపక్షాల విషయంలో

రవాణాశాఖ కమీషనర్ ను దుర్భాషలాడి, భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వారేమో దర్జాగా బయట తిరుగుతున్నారు. వారిపై  కేసులు నమోదు చేయాలని, చర్చలు తీసుకోవాలని దీక్ష చేసిన వారినేమో పోలీసులు అరెస్టు చేసారు.

Law takes its own course in AP

రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందా? చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్టం ముందు అందరూ సమానమే. ఇలా...దశాబ్దాల తరబడి వింటూనే ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ మాట నిజమేనా అనిపిస్తోంది.‘అశ్వథ్థామ అతః కుంజరహ’ అని మహాభారతంలో  ధర్మరాజు న్నట్లు. రవాణాశాఖ కమీషనర్ ను దుర్భాషలాడి, భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వారేమో దర్జాగా బయట తిరుగుతున్నారు. వారిపై  కేసులు నమోదు చేయాలని, చర్చలు తీసుకోవాలని దీక్ష చేసిన వారినేమో పోలీసులు అరెస్టు చేసారు. ఇంతకీ అరెస్టు చేయాల్సింది ఎవరిని? చర్యలు తీసుకోవాల్సింది ఎవరిపైన అని అనుమానాలు వస్తున్నాయ్. మొదటి సంఘటనేమో టిడిపి నేతలకు సంబంధించింది కాబట్టి చర్యలు లేవు. రెండో ఘటనేమో ప్రతిపక్షానికి సంబంధించింది. కాబట్టే వెంటనే చట్టం తనపని తాను చేసుకుపోతోంది. చంద్రన్న పాలనా మజాకానా?

మూడు రోజుల క్రితం టిడిపి విజయవాడ ఎంపి కేశినేని నాని, సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్నకు రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంకు జరిగిన గొడవ అందరికీ తెలిసిందే కదా? ఆ వివాదం పెద్దదయ్యేటప్పటికి చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులను పిలిపించి క్లాస్ పీకారట. దాంతో వెంటనే వారందరూ కమీషనర్ కు క్షమాపణ చెప్పేసారట. దాంతో ఎవరిపైనా చర్యలు లేవు. కమీషనర్ ఎంత సీనియర్ ఐపిఎస్ అధికారి అయితే మాత్రం ఏం చేస్తారు స్వయంగా చంద్రబాబే పంచాయితీ చేసిన తర్వాత?

అక్కడి నుండే రచ్చ మొదలైంది. వివాదం వెలుగు చూసిన తర్వాత వైసీపీ ఊరుకుంటుందా? ఊరుకోదు కాక ఊరుకోదు. నానా రచ్చ చేస్తోంది. ఈ రోజు అసెంబ్లీలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకంగా అసెంబ్లీ ప్రాంగణంలోనే దీక్షకు దిగారు. దాంతో చట్టానికి వెంటనే తన కర్తవ్యం గుర్తుకు వచ్చేసింది. ఇంకేముంది ఎంఎల్ఏ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారంటూ వెంటనే అరెస్టు చేసేసింది. పోనీ అరెస్టు చేసి విడుదల చేసిందా అంటే అదీ లేదు. అరెస్టు చేసిన చెవిరెడ్డిని విజయవాడలో కాకుండా దూరంగా ఉన్న మంగళగిరి పోలీస్టేషన్ కు తరలించారు. ఎవరినీ కలవనీయటం కూడా లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంత బాగా పనిచేస్తోందన్న మాట.

 

Follow Us:
Download App:
  • android
  • ios