విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడిన ఘటనలో రాళ్ల కింద మరికొందరు చిక్కుకుని వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీరిలో నలుగురు పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది వుంటారని అనుమానిస్తున్నారు.

దీనిలో భాగంగా విధుల్లో కనిపించకుండా పోయిన సిబ్బంది వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. వర్షాల కారణంగా 4 రోజులుగా కొండపై నుంచి రాళ్లు, మట్టి జారిపడుతున్నాయి.

ఇదే సమయంలో సీఎం పర్యటన సందర్భంగా కొండపై రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నేపథ్యంలో మహామండపం లిఫ్ట్ మార్గంలో జగన్ దుర్గమ్మ దర్శనానికి రానున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

Also Read: జగన్ రాకకు ముందు కలవరం: విరిగి పడిన ఇంద్రకీలాద్రి కొండచరియలు

ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న చిన్న రాళ్లు కిందపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డుల్ని కూడా ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో ఆ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడే అవకాశం వుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

అయితే బుధవారమే కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో భద్రతా కారణాల రీత్యా సీఎం రాక ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జారిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లు తెప్పిస్తున్నారు.