విజయవాడ శరన్నవరాత్రి వేడుకల్లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా 4 రోజుల నుంచి కొండపై నుంచి రాళ్లు, మట్టి జారిపడుతున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

మూలా నక్షత్రం కావడంతో బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయన రాకకు కొద్దిసేపటి ముందే కొండచరియలు విరిగిపడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.

ఈ ప్రమాదంలో ఓ కార్మికుడికి కాలు విరిగిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని బాపట్ల మండలం చెరువుదివ్వెల గ్రామస్తులు బ్రహ్మాయ్య, రమణగా గుర్తించారు. 

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న చిన్న రాళ్లు కిందపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డుల్ని కూడా ఏర్పాటు చేశారు.

రెండు మూడు రోజుల్లో ఆ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడే అవకాశం వుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అయితే బుధవారమే కొండ చరియలు విరిగిపడ్డాయి.

కొండచరియలు విరిగిపడటంతో భద్రతా కారణాల రీత్యా సీఎం రాక ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జారిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లు తెప్పిస్తున్నారు.