శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గురువారం నాడు మరోసారి కొండచరియలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ సమయంలో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన శ్రీశైలం డ్యామ్ కు సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.  రాత్రి పూట బండరాళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ వాహనాల రాకపోకలు కానీ, జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తాజాగా ఇవాళ కూడ మరోసారి కొండచరియలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో నీటి తుంపర్లు కొండలపై పడడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో  ఆ సుందర దృశ్యాలను  తిలకించేందుకు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆగష్టు 20వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ తరహా ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.