అందుకే పోలీసు ఉద్యోగం వదిలేశా : మాజీ సిబిఐ జెడీ లక్ష్మీనారాయణ

Lakshmi Narayana clarifies on retirement
Highlights

పోలీసు ఉద్యోగ విరమణపై లక్ష్మీనారాయణ క్లారిటీ

సిబిఐ లో డైనమిక్ పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు లక్ష్మీనారాయణ. ఆయన సిబిఐ జెడిగా పనిచేసిన సమయంలో జగన్ కేసు సహా అనేక కేసులు విచారణ జరిగాయి. అయితే తర్వాత కాలంలో చంద్రబాబుపై సిబిఐ విచారణ విషయంలో తమ వద్ద సరిపోయే సిబ్బంది లేరంటూ లక్ష్మీనారాయణ కోర్టుకు నివేదించారన్న అపవాదు కూడా ఉంది.

అదంతా గతం. ప్రస్తుతం ఆయన తన ఐపిఎస్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. ఆయన బిజెపికి పోతారని ప్రచారం సాగగా, లేదు టిడిపి అని కూడా అన్నారు. తర్వాత పవన్ తో నడుస్తారని కూడా హడావిడి సాగింది. కానీ ఆయన రాజకీయ ప్రవేశం విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా గుంటూరు జిల్లా యాజిలిలో లక్ష్మీనారాయణ ఒక యాగం ప్రారంభించారు. రైతులను సంఘటిత పరిచే కార్యక్రమాన్ని యాజిలిలోనే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తనుకు ఎన్ఐఆర్ డి లో పనిచేయాలన్న ఆసక్తి ఉందని మహారాష్ట్ర ప్రభుత్వానికి రెండుసార్లు విన్నవించుకున్నానని చెప్పారు. అయినా తనకు అనుమతి రాలేదన్నారు. పోలీసు ఉద్యోగివి నీకెందుకు ఆ పని అని తిరస్కరించారని అన్నారు. తనకు గ్రామాల్లో పనిచేయాలన్న ఆసక్తి ఉందన్నారు. ఆ ఆసక్తి తోనే గ్రామాల్లో పనిచేసేందుకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి తాను తన పదవిని వదిలేశానన్నారు.

ఉద్యోగులకు ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు ఉంటాయి. మరి రైతులకు ఇంక్రిమెంట్లు ఎందుకు ఉండవు అని ప్రశ్నించారు. రైతులు సంఘటితంగా ఉంటే ఏదైనా సాధ్యమే అన్నారు లక్ష్మీనారాయణ. గ్రామాల్లో రైతుల్లో ఆనందం నింపేందుకే తాను పోలీసు పదవిని వదులుకున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పడం చర్చనీయాంశమైంది.

loader