రుణమాఫీ కోసం ఇప్పటికీ లక్షలాది మంది అన్నదాతలు బ్యాంకుల చుట్టూ, రైతు సాధికార సంస్ధ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఇంకొద్ది కాలమైతే మళ్ళీ ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. అప్పుడన్నా చంద్రబాబు వీరిని పట్టించుకుంటారోమో చూడాలి.
తరచూ చంద్రబాబునాయుడు చేసే రుణమాఫీ ప్రకటనల్లోని డొల్లతనం బయటడింది. ఎక్కడ మాట్లాడిన సరే తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసేసినట్లు ప్రకటించేసుకుంటున్నారు. పైగా దేశంలో ఎక్కడా లేనట్లు తామే ఘనకార్యం చేసామని టముకేసుకుంటున్నారు. కానీ గడచిన మూడేళ్ళల్లో ప్రభుత్వం చేసిన రుణమాఫీ కేవలం రూ. 11 వేల కోట్లేనంటూ స్పష్టమైంది. టిడిపి అనుకూల మీడియా లెక్కలతో సహా ప్రచురించి చంద్రబాబు గాలి తీసేసింది. చంద్రబాబుకు ఇబ్బందిగా ఉండే కథనాన్ని ఎందుకు ప్రచురించిందో ఏమో.
రాష్ట్రంలోని రైతుల పరిస్ధితి అయోమయంలో పడిందన్నది వాస్తవం. ఒకవైపు రుణమాఫీ కాక, మరోవైపు బ్యాంకులు రుణాలను అందరికీ అందచకపోవటంతో అన్నదాతల పరిస్ధితి దారుణమైపోయింది. పోయిన ఎన్నికల సందర్భంగా రైతు రుణాలను మాఫీ చేస్తానంటూ చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
ఆ హామీ నిజమే అనుకుని రైతాంగం తాము తీసుకున్న బ్యాంకు రుణాలను కట్టడం మానేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చేయాల్సిన రుణమాఫీ సుమారు రూ. 90 వేల కోట్లు. ఇది స్వయంగా టిడిపి నేతలు టివి చర్చల సందర్భంగా చెప్పిన అంకెలే. 
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ప్లేటు ఫిరాయించారు. అర్హులకు మాత్రమే రుణమాఫీ జరుగుతుందన్నారు. అర్హులను తేల్చటం కోసం కోటయ్య కమిటీని వేసారు. కమిటి నివేదిక ప్రకారం చేయాల్సిన రుణమాఫీ రూ. 36 వేల కోట్లే. ఏవేవో నిబంధనలు పేరుచెప్పి లక్షల సంఖ్యలో రైతులను మాఫీ పథకం నుండి తప్పించారు. దాంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఇదిలావుండగా, మూడేళ్ళలో ప్రభుత్వం చేసిన మాఫీ కేవలం రూ. 11 వేల కోట్లే. అయితే, రుణమాఫీ అయిపోయినట్లు చంద్రబాబే ఎన్నోమార్లు చెప్పుకున్నారు. ఇప్పటికీ 8 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయట. నిబంధనల ప్రకారం లేవంటూ అధికారులు తిరస్కరించిన దరఖాస్తులు కూడా లక్షల్లోనే ఉన్నాయి.
రుణమాఫీ కోసం ఇప్పటికీ లక్షలాది మంది అన్నదాతలు బ్యాంకుల చుట్టూ, రైతు సాధికార సంస్ధ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఇంకొద్ది కాలమైతే మళ్ళీ ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. అప్పుడన్నా చంద్రబాబు వీరిని పట్టించుకుంటారోమో చూడాలి.
