పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్థారించిన లేడీ డాక్టర్ అబార్షన్ సలహా ఇచ్చింది. అది వికటించడంతో గర్భిణీ మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. 

అనంతపురం : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టప్రకారం నేరమని తెలిసినా ఓ వైద్యురాలు.. ఓ మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాకుండా పుట్టబోయేది ఆడపిల్ల అని చెబుతూ.. అబార్షన్ చేయించుకోమని సూచించింది. ఈ క్రమంలో అబార్షన్ వికటించడంతో గర్భిణి మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు అకాల మృత్యువాత పడ్డాయి.

మరో ఘటనలో కాన్పు కష్టమై మాతా శిశు మరణం చోటు చేసుకుంది. ఈ రెండు వేరువేరు ఘటనలు సోమవారంనాడే చోటు చేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యమే.. వీరి మృతికి కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ఘటనలో గర్భస్థ పిండం లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల పుట్టబోతుందని నిర్ధారించింది ఓ వైద్యురాలు.

ఆ తర్వాత అబార్షన్ చేసే క్రమంలో గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. అనంతపురం నగరంలో ఈ ఘటన కలకలం రేపింది. ఈ ప్రైవేటు వైద్యురాలి నిర్వాకంపై అనంతపురం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన హనుమంతు, కవిత (25) దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

కొడుకు కోసం మరోసారి గర్భం దాల్చింది కవిత. అయితే, ఈసారి కూడా కూతురు పుడితే ఎలా అనే భయంతో ముందుగానే.. గర్భంలో ఉంది ఎవరో తెలుసుకోవాలనుకున్నారు. దీనికోసం అనంతపురం శ్రీనివాస్ నగర్ లో ఉన్న రూత్ క్లినిక్కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గర్భస్థ పరీక్షలు చేసిన వైద్యురాలు లక్ష్మీకాంతమ్మ.. గర్భంలో ఉన్నది ఆడపిల్లగా తేల్చింది. అబార్షన్ చేయించుకోమంటూ సలహా ఇచ్చింది.

దీనికి దంపతులు అంగీకరించారు. ఆదివారం అబార్షన్ కు అన్ని ఏర్పాట్లు చేసి.. అబార్షన్ చేశారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఇంటికి పంపించారు. మర్నాడు సోమవారం నాడు కవిత పరిస్థితి విషమంగా మారింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అబార్షన్ చేసిన రూత్ క్లినిక్కి తీసుకువచ్చారు. అయితే, ఆ సమయంలో డాక్టర్ లక్ష్మీకాంతమ్మ అక్కడ లేదు. దీంతో ఆమెను వెంటనే సిబ్బంది ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకెళ్లమంటూ సూచించారు. అక్కడ కవితను పరీక్షించిన వైద్యంలో ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. షాక్ అయిన కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ లక్ష్మీకాంతమ్మ మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అనంతపురంలోనే జరిగిన మరో ఘటనలో.. కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మాతాశిసుమరణం చోటుచేసుకుంది. ఆర్వేటీ నగర్కు చెందిన మహబూబ్బాషా, సనం సుల్తానా (28) దంపతులు. వీరికి మూడేళ్ల వయసున్న ఓ కుమారుడు ఉన్నాడు. మొదటి కాన్పు బాలాజీ నర్సింగ్ హోమ్ లో జరిగింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో అదే నమ్మకంతో రెండో కాన్పుకు కూడా అక్కడే వైద్యురాలితో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆ నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు భయపడాల్సిన పనిలేదని గ్యాస్టిక్ సమస్య ఉండొచ్చని.. నొప్పులు కాదని చెప్పి ఇంటికి పంపించేశారు. 

పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ కు పట్టుబట్టిన బంధువులు.. పందిట్లోనే తలలు పగల కొట్టుకుని..

సోమవారం ఉదయం మరోసారి అలాగే నొప్పులు రావడంతో మళ్లీ హాస్పిటల్ కి వెళ్ళగా.. జోత్స్నా అనే వైద్యురాలు పరీక్షించి నార్మల్ డెలివరీ అవుతుందంటూ లేబర్ రూమ్ లోకి తీసుకెళ్లింది. స్కానింగ్లో బిడ్డ మృతి చెందినట్లు ధృవీకరించారు. గర్భంలో మృత శిశువు ఉందని తొలగించాలని చెప్పి.. ఆ శిశువును తొలగించే క్రమంలో సనం సుల్తానా అవస్మారక స్థితికి చేరుకుంది. వైద్యులు ఎన్ని సఫర్యలు చేసినా ఫలితం లేకపోయింది. కాసేపటికి ఆమె మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే తల్లి బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు హాస్పిటల్ కి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి కేసు నమోదు చేయడంతో అప్పటికి వివాదం సర్దుమణిగింది. వైద్య ఆరోగ్యశాఖ డెమో బృందం ఈ విషయం తెలుసుకొని నర్సింగ్ హోమ్ కు వచ్చి విచారణ చేపట్టింది. గర్భంలోనే శిశువు మృతు మృతి చెందినప్పుడు ఉమ్మనీరులో రక్తం చేరి.. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల మెదడు కు సరిగా ఆక్సిజన్ అందక.. ఫిట్స్ వచ్చి గృహిణి మృతి చెందిందని డాక్టర్ జ్యోత్స్న అనుమానాలు వ్యక్తం చేశారు.