- Home
- Andhra Pradesh
- పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ కు పట్టుబట్టిన బంధువులు.. పందిట్లోనే తలలు పగల కొట్టుకుని..
పెళ్లిలో వధూవరుల డ్యాన్స్ కు పట్టుబట్టిన బంధువులు.. పందిట్లోనే తలలు పగల కొట్టుకుని..
పెళ్లిలో వధూవరులను డ్యాన్స్ చేయాలని పట్టుబట్టడంతో.. ఏర్పడిన గొడవలో తలలు పగలగొట్టుకుని గాయాలపాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.

తూర్పు గోదావరి : పెళ్లిలో చిన్న చిన్న విషయాలకు గొడవలు పడడం.. పెట్టుపోతల దగ్గరో.. మర్యాదల దగ్గరో.. భోజనాల దగ్గరో.. వధూవరుల కుటుంబాలకి మనస్పర్ధలు రావడం..అవి ఘర్షణలకు దారి తీయడం చూస్తూనే ఉంటాం. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ విచిత్రమైన గొడవ వెలుగు చూసింది. ఇరువర్గాల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే సీతానగరంలోని ఓ వివాహ వేడుకలో చిన్న వివాదం చోటు చేసుకుంది. అది వధూవరుల తరపు వారి కొట్లాటకు దారి తీసింది. దీంతో ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో సుబ్రహ్మణ్యం, పూజిత అనే యువతీ యువకుల పెళ్లి జరిగింది. దీనికోసం ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుక కోసం పెళ్లి కుమార్తె తరపు బంధువులంతా తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి రామచంద్రపురానికి వచ్చారు.
వివాహం వారు అనుకున్నట్లుగానే వైభవంగా జరిగింది. ఆ తర్వాత వివాహ విందు జరుగుతుంది. ఇటీవల కాలంలో వివాహ వేడుకల్లో వధూవరులు డాన్స్ చేయడం మామూలుగా మారిపోయింది. అలాగే ఈ వధూవరులు కూడా డాన్స్ చేయాలని అక్కడున్న వారంతా వారిద్దరి మీద ఒత్తిడి తెచ్చారు.
అయితే, వధువు తరపు బంధువులు.. ఆడపిల్ల అంతమందిలో.. తన వివాహ వేడుకలోనే డ్యాన్స్ చేయడం ఏమిటంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో వధువు కుటుంబ సభ్యులకి.. వరుడు కుటుంబ సభ్యులకు మధ్య వాటా మాటా పెరిగింది. అది వరుడి కుటుంబ సభ్యులు దాడికి దిగడం వరకు వెళ్ళింది.
ఈ దాడిలో ఓ మహిళకు తలపగిలింది. మరో వ్యక్తి చేయి విరిగింది. మరో ముగ్గురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ గలాట విషయం సమాచారమందడంతో కోరుకొండ సిఐ ఉమామహేశ్వర రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆయన ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫిర్యాదు ఇవ్వాలని.. వధూవరులతోపాటు.. వేడుకలో పాల్గొన్న వారంతా పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.