విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పరిచయం అవసరం లేని వ్యక్తి. రాష్ట్రాలు వేరు అయినా పార్టీ అధికారంలో లేకపోయినా ఆయన మాట చెల్లుబాటు అవుతుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెర వెనుక ఉండి మెుత్తం నడిపించింది ఆయనే. 

వైఎస్ కేబినేట్ లో ఉండే మంత్రులకు దిశానిర్దేశం చేసేది ఆయనే. కేబినేట్ విస్తరణ వస్తే చాలు సీఎం ఇంటి దగ్గర కంటే ఆయన ఇంటి దగ్గరే ఆశావాహులు క్యూ కట్టేవారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ కు దిశా నిర్దేశం చేసింది కూడా ఆయనే అని వైఎస్ పలుమార్లు చెప్పుకొచ్చేవారు. 

ఒకొనొక సందర్భంలో రాజకీయ పద్మవ్యూహాన్ని తన మేధస్సుతో చేధించగల నాయకుడు ఆయన అంటూ స్వయంగా వైఎస్ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా... 
ఇంకెవరు వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆత్మగా చెప్పుకునే కేవీపీ జగన్ ను సీఎం చెయ్యడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు తెరవెనుక చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. వైఎస్ మరణానంతరం జగన్ ను సీఎం చెయ్యాలంటూ కొందరు చేసిన హడావిడి కేవీపీకి చిర్రెత్తుకొచ్చింది. కాస్త సంయమనం పాటించాలని సమయం వచ్చినప్పుడు జగన్ ను సీఎం చేద్దామంటూ సర్దిచెప్పారు. 

ఆ తర్వాత వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కొన్ని విషయాల్లో జగన్ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని ఎదిరించారు కూడా. అయితే ఓపిగ్గా ఉండాలంటూ జగన్ ను హెచ్చరించారు. 

ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పుయాత్రకు బయలు దేరారు. అలా కొన్ని అంశాలలో కేవీపి జగన్ ను విబేధించి ఆ కుటుంబానికి దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో కనీసం జగన్ కు ఎలాంటి సహాయం చెయ్యలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 

కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరు సంపాదించుకున్న కేవీపీకి చంద్రబాబుతో పొత్తు నచ్చడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబుతో కలిసి ఏపీలో నడిచేందుకు కేవీపీ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో అను నిత్యం విబేధిస్తూనే ఉన్నారు కేవీపీ. పోలవరం, ప్రత్యేక హోదా వంటి అంశాలలో చంద్రబాబు నాయుడుకి లేఖలు రాసి చుక్కలు చూపించారు. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. 

తన రాజకీయ శత్రువు చంద్రబాబును గద్దె దించాలని వ్యూహాలు రచించే కేవీపీ ఆయనతో కలిసి వేదిక పంచుకునేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి మౌనంగా ఉండిపోయారు. 

కనీసం నోరు మెుదపడం లేదు. కాంగ్రెస్ టీడీపీల పొత్తును నిరసిస్తూ మాజీమంత్రులు సి. రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ లు పార్టీ వీడుతున్నా కనీసం వద్దని కూడా వారించలేదు. కాంగ్రెస్ టీడీపీల పొత్తు అనైతికంగా భావిస్తున్న కేవీపీ ఇకపై వైఎస్ జగన్ ను సీఎం చేసేందుకు పావులు కదుపుతున్నారట. 
 
గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారట. ముఖ్యంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు వస్తున్న జనాదరణ, నవరత్నాలు వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారని సమాచారం. 

అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై వస్తున్న వ్యతిరేకతలపైనా ఆరా తీస్తున్నారట. అలాగే 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి గల కారణాలను సైతం విశ్లేషించారట వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు. 

ఈ సందర్భంలో వైఎస్ జగన్ ప్రజాదరణపై సంతృప్తి వ్యక్తం చేసిన కేవీపీ, 2019 ఎన్నికల్లో జగన్ ను సీఎం చెయ్యడమే లక్ష్యంగా కొన్ని అస్త్రసస్త్రాలను రెడీ చేశారని వినికిడి. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు అండగా లేకపోవడంతో ఈ ఎన్నికల్లో మాత్రం యాక్టివ్ రోల్ ప్లే చెయ్యాలని చూస్తున్నారు.  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన క్యాడర్ ను తయారు చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అంటేనే ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. 

ఇంకా చెప్పాలంటే వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావుకు టచ్ లో చాలా మంది నాయకులు ఉన్నారు. అధికారంలో లేకపోయినా ఇప్పటికీ కేవీపీ ఇల్లు రాజకీయ నాయకుల హడావిడితో సందడిగా ఉంటుందట. 

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైన్యాన్ని అంతా ఏకం చెయ్యాలని వారిని జగన్ వెంట పంపించాలని ప్రయత్నిస్తున్నారట. ఒక వేళ సి రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ మార్గంలో కేవీపీ కూడా పార్టీ వీడితే పర్వాలేదు ఒకవేళ వీడని నేపథ్యంలో తెరవెనుక జగన్ కు మద్దతు ప్రకటించనున్నారు. 

వైఎస్ఆర్  సైన్యంలాంటి సీనియర్ నాయకులు వైసీపీకి మద్దతు ఇచ్చేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా బాబుకు వ్యతిరేకంగా దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకును ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీకి మద్దతు పలికేలా వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.  

కేవీపీ నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ వర్గాలు కేవీపీకి ఆహ్వానం కూడా అందించాయి. అయితే కేవీపీ వైసీపీలోకి చేరి ప్రత్యక్షంగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడతారా లేక ఎప్పటి లాగే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతారా అన్నది వేచి చూడాలి.