పచ్చగా కళకళలాడుతున్న రాష్ట్రాన్ని విడగొట్టి  నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అఫ్ కోర్స్ భాజపాకు కూడా భాగముందనుకోండి. అందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇపుడేమో బిల్డప్ ఇస్తున్నారు ఏదో ఉద్దరించేస్తామంటూ. జనాలకు తెలీదా ఎవరి జాతకాలోమిటో?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మాటలు చూస్తుంటే ‘నిద్రపోతున్న వాళ్ళని గిల్లి జోల పాడినట్లుం’ది. ఈయనగారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దగాకోరు రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా నరేంద్రమోడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారట. అమిత్ షా అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలుపుతున్నారట.

ఇంకా చాలా అన్నారులేండి. రాష్ట్రప్రయోజనాలను పణంగా పెట్టి అమిత్ షా తో విందు రాజకీయాలు చేయటం సిగ్గు చేటని మండిపడ్డారు. రాష్ట్రప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగాలని సవాలు కూడా విసిరారండోయ్. ప్రత్యేకహోదా కోసం తామంతా రాహూల్ గాంధి నాయకత్వంలో పోరాటాలు చేస్తారట. టిడిపి-భాజపా కూటమిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయట.

అంతాబాగానే ఉంది కానీ, కెవిపి మాటలు విన్న తర్వాత కొన్ని సందేహాలు వస్తున్నాయ్. రాష్ట్ర ప్రస్తుత దుస్ధితికి కారణమెవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అమిత్ షా అడుగులకు చంద్రబాబు మడుగులొత్తుతున్నారా? తప్పదు కదా? కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రంలో ఉన్న వారు చేయకతప్పదు. విభజన చట్టాన్ని మోడి సర్కార్ ఏమాత్రం ఖాతరు చేయటంలేదు. దాంతో చంద్రబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి. దానిమీద ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కున్నారు. దానిపైన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు కదా? ఇక చంద్రబాబు చేయగలిగేదేముంది?

రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు వద్దంటున్నా వినకుండా రాష్ట్ర విభజన చేసి ప్రస్తుత ఏపిని నట్టేట ముంచిందే కాంగ్రెస్. రాష్ట్ర ప్రయోజనాలను మంటగలిపి అధిష్టానం ఆడమన్నట్లు ఆడి రాష్ట్రవిభజనకు సహకరించింది ఈ కాంగ్రెస్ నేతలే కదా? మళ్ళీ ప్రత్యేకహోదా కోసం రాహూల్ నాయకత్వంలో పోరాటాలు చేస్తారట.

పచ్చగా కళకళలాడుతున్న రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అఫ్ కోర్స్ భాజపాకు కూడా భాగముందనుకోండి. అందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇపుడేమో బిల్డప్ ఇస్తున్నారు ఏదో ఉద్దరించేస్తామంటూ. జనాలకు తెలీదా ఎవరి జాతకాలోమిటో?