కర్నూలు జిల్లా టిడిపిలో అనూహ్య పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. పరిణామాలు కూడా ఒక మంత్రిని లక్ష్యంగా చేసుకుని జరుగుతుండటం గమనార్హం. దాంతో పార్టీలో ఎప్పుడేమి జరుగుతుందో తెలీక ద్వితీయ శ్రేణి నాయకులు అయోమయంలో పడిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, జిల్లాలో బాగా బలమైన భూమా కుటుంబం రాజకీయంగా బలహీనపడుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, మంత్రి అఖిలప్రియ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు అందరిలోనూ అనుమానాలను పెంచేస్తోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు షాక్ తప్పేలా లేదు. మొన్న డిసెంబర్ 31వ తేదీన నంద్యాలలోని టిడిపి నేత ఏవి సుబ్బారాడ్డి తెరలేపిన విందు రాజకీయంతో సర్వత్రా చర్చ మొదలైంది.

జిల్లాలో భూమా కుటుంబానికి బద్ద శతృవులు చాలామందే ఉన్నారు. అందులో చాలామంది టిడిపిలోనే ఉన్నారు. భూమా నాగిరెడ్డి ఉన్నంత కాలం వారంతా ఏమీ చేయలేకపోయారు. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి మరణించారో అప్పటి నుండే ఆయన శతృవులంతా ఏకమవ్వటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే అఖిలయప్రియకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.

శతృవులంతా వెనుకవుండి ఏవి సుబ్బారెడ్డిని ముందుకు తోస్తున్నట్లు సమాచారం. మొన్నటి డిసెంబర్ 31 విందు కూడా అందులో భాగమేనట. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో టిడిపి టిక్కెట్టు సాధించేందుకు ఇప్పటి నుండే ఏవి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏవికి జిల్లాలోనే కాకుండా బయట కూడా కొందరు కీలక నేతలు పూర్తి స్ధాయిలో మద్దతుగా నిలుస్తున్నారట.

భూమా కుటుంబానికి బద్ద శతృవులుగా ప్రచారంలో ఉన్న ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుటుంబం, శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండి ఫరూఖ్ కుటుంబంతో పాటు పలువురు నేతలు పూర్తి వ్యతిరేకం. వారికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి కూడా తోడైనట్లు జిల్లా రాజకీయాల్లో బాగా ప్రచారం జరుగుతోంది. అందరూ కలిసే ఏవి సుబ్బారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారట.

 

పై స్ధాయిలో మద్దతు కూడగట్టుకున్న తర్వాతే నియోజకవర్గం, మండల, గ్రామస్ధాయిలో మద్దతు కోసం ఏవి పావులు కదపటం మొదలుపెట్టారట. ఏవి-అఖిల వ్యవహారాలు చంద్రబాబునాయుడు దృష్టిలో కూడా ఉన్నాయట. అదేసమయంలో చంద్రబాబుకు అఖిల మీద సదభిప్రాయం కూడా లేదన్నది తేలిపోయింది. మంత్రిగా అఖిల పూర్తిగా విఫలమయ్యారన్నది చంద్రబాబు భావన. మొన్న కృష్ణానది బోటు ప్రమాదం ఘటనలో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో అఖిలకు షాక్ తప్పదనే ప్రచారం జిల్లాలో బాగా ఊపందుకున్నది.