కర్నూలు: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం జరిగిన చోట వాతావరణం అత్యంత బీభత్సంగా ఉంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. వోల్వో బస్సు బైక్ ను, తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. 

తుఫాను వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా పెళ్లి చూపులకు వెళ్లి వస్తున్నారు. తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న 15 మందిలో ఒక్కరు మాత్రమే బ్రతికి బయటపడ్డారు. 14 మంది మరణించగా, ఒకరు గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

బైక్ ను తప్పించబోయి, డివైడర్ దాటి అవతలి రోడ్డులోకి వెళ్లి తుఫాన్ వాహనాన్ని తమ బస్సు ఢీకొట్టిందని బస్సు డ్రైవర్ జోసెఫ్ చెబుతున్నాడు. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మరణించారు. మసూం అనే వ్యక్తి మరణించగా, ఖాజా అనే వ్యక్తి గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో బైక్, తుఫాన్ వాహనం నుజ్జునుజ్జు అయ్యాయి.

బస్సు డ్రైవర్ జోసెఫ్, క్లీనర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 9 మందిని గుర్తించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం (ఫోటోలు)

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మంది మృతి