కురపాం: కరోనా మహమ్మారి టిడిపిలో విషాదాన్ని నింపింది. విజయనగరం జిల్లా కురుపాం టిడిపి ఇంఛార్జి నరసింహప్రియ థాట్రాజ్ కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇవాళ(సోమవారం)తుదిశ్వాన విడిచారు. ఆమె మృతికి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. ఆమె మరణ వార్త తెలిసి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

నరసింహప్రియ థాట్రాజ్ వెనుకబడిన గిరిజన ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి, గిరిజనుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. గిరిజనుల హక్కుల కోసం ఆమె అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.  పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె అందించిన సేవలను మరిచిపోలేమన్నారు. ఆమె మరణంతో బాధలో వున్న థాట్రాజ్ కుటుంబసభ్యులకు చంద్రబాబునాయుడు సానుభూతి తెలియజేశారు. 

 నరసింహప్రియ థాట్రాజ్‌ మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజులకు స్వయానా సోదరి. అన్నల అండదండలతో ఆమె గతంలో రాజకీయాల్లో కూడా కొనసాగారు. పార్వతీపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె తనయుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే గతేడాదే నరసింహప్రియ థాట్రాజ్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ మరణించారు.