ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) హఠాన్మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తనను షాక్ గురిచేసిందని చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ప్రియమైన మిత్రుడి ఆకస్మిక మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. నమ్మలేని విధంగా షాక్ అయ్యాను ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా త్వరగా వెళ్లిపోయారు అన్న.. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సంతాపం తెలిపారు. మంత్రి గౌతమ్‌ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయన కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Scroll to load tweet…

 మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే గౌతమ్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డికి గుండె పోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. గౌతమ్ రెడ్డి మరణించిన విషయాన్ని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో మేకపాటి కుటుంబంతో పాటు, వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. 

గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. ఆయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండం బ్రాహ్మణపల్లి. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వైసీపీ ఆరంభం నుంచి మేకపాటి కుటుంబం వైఎస్ జగన్‌తోనే ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. 

మేకపాటి గౌతమ్ రెడ్డి 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.