కృష్ణా జిల్లాలో గుప్త నిధుల వ్యవహారం కలకలం రేపింది. ముసునూరు మండలం గొల్లపూడి శివారు గుడిపాడు గ్రామంలో గ్రామంలో వెల్నెస్ సెంటర్ నిర్మాణం కోసం తవ్విన పునాది గుంటలో పురాతనమైన ఒక మట్టి కుండ బయటపడింది.

ఈ మట్టికుండను గుర్తించిన గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడే ఓ ముఠా రాత్రికి రాత్రి ఈ ప్రాంతంలో సొరంగం మాదిరిగా తవ్వకాలు కొనసాగించింది. ఈ క్రమంలో అనేక విలువైన వస్తువులను దోచుకువెళ్లినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. 

దీనిపై గ్రామ పెద్దలు ఫిర్యాదు చేయడంతో ముసునూరు తహసీల్దార్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పురాతనమైన కుండ, గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగించిన సొరంగం వంటి మార్గాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సొరంగాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆర్కియాలజీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో విజయవాడ నుంచి ప్రత్యేక బృందం గొల్లపూడి బయల్దేరింది. పురాతత్వ శాఖ అధికారులు సొరంగాన్ని పరిశీలిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది