విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపిటీసి అభ్యర్థిని కొందరు దుండగులు అత్యంత  కిరాతకంగా కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఈ హత్య జిల్లాలో కలకలాన్ని సృష్టించింది. 

ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పర్రచివర గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తాత సాంబశివరావు పనిచేస్తున్నారు. అయితే ఇటీవల స్థానికసంస్థల ఎన్నికల్లో కూడా ఇతడు టిడిపి తరపున ఎంపీటీసిగా పోటీలో నిలిచాడు. అయితే కరోనా విజృంభణ కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడటంతో అతడు తన పనిలో తాను బిజీ అయిపోయాడు. 

read more  తలకిందులుగా నీటి బకెట్లో పడి.. రెండేళ్ల చిన్నారి మృతి..

ఈ క్రమంలోనే ఇవాళ అతడు అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. నాగాయలంక నుంచి పెద్ద గౌడపాలెం వెళ్తుండగా దారిలో మెరక పాలెం వద్ద కాపు కాచిన దుండగులు అతడిపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో నడి రోడ్డుపైనే అతడి గొంతుకోసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. రక్తపు మడుగులో పడివున్న అతడు చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాతే దుండగులు అక్కడి నుండి పరారైనట్లు సమాచారం. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు. అవనిగడ్డ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గతంలో సాంబశివరావుకు కొందరితో గొడవలు ఉన్నట్లు... వారే ఈ హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.