ఏపీపై కోయంబేడు పంజా: 48 కొత్త కరోనా కేసులు, మరో మరణం

ఆంధ్రప్రదేశ్ మీద కోయంబేడు పంజా విసురుతూనే ఉంది. కోయంబేడు ప్రభావంతో ఏపీలో తాజాగా 90 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 48 కేసులు నమోదు కాగా, ఓ మరణం సంభవించింది.

Koyambedu effect on AP: 48 fresh coronavirus cases registered

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కోయంబేడు పంజా విసురుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతం కోయంబేడు ప్రభావం కారణంగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 48 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2205కు చేరుకుంది. 48 కొత్త కేసుల్లో 31 కేసులు చెన్నైలోని కోయంబేడ్ మార్కెట్ తో లింకులున్నవే కావడం గమనార్హం

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాధితో మరో మరణం సంభవించింది. కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య 49కి చేరుకుంది. కర్నూలులో అత్యధికంగా 19 మరణాలు సంభవించాయి. 

గత 24 గంటల్లో 9,628 శాంపిల్స్ ను పరీక్షించగా 48 కేసులు బయటపడ్డాయి. 101 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో 7, కర్నూలు జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్కును దాటింది. జిల్లాలో మొత్తం 608 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా 413 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అనంతపురం, తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదు. 

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 122
చిత్తూరు 173
తూర్పు గోదావరి 52
గుంటూరు 413
కడప 102
కృష్ణా 367
కర్నూలు 608
నెల్లూరు 149
ప్రకాశం 63
శ్రీకాకుళం 7
విశాఖపట్నం 72
విజయనగరం 7
పశ్చిమ గోదావరి 70 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios