ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో తమను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు స్పందించారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు వైసీపీ బహిష్కృత నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చేతిలో అధికారం వుందని సస్పెండ్ చేశారని.. కనీసం షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని.. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమని కోటంరెడ్డి దుయ్యబట్టారు.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎక్కడా తప్పు చేయలేదని తేల్చిచెప్పారు. సస్పెన్షన్ చేసినందుకు సంతోషంగా వుందన్నారు. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలుస్తానని.. తాను వెంకట రమణకే ఓటు వేశానని స్పష్టం చేశారు. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానని.. నాకు 20 కోట్లు ఇచ్చారని సజ్జల దేవునిపై ప్రమాణం చేస్తారా అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కువ చేసినవారిని దేవుడు కత్తిరిస్తాడని.. వైసీపీలోని కొందరు పెద్దల వల్ల సీఎం సహా అందరూ అవమానపాలవుతారని ఆయన జోస్యం చెప్పారు. తాను చంద్రబాబుతో , బీజేపీతో మాట్లాడలేదని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తన ఓటుతోనే రమణ ఎమ్మెల్సీ అయ్యాడని.. తాను జగన్‌కు వెన్నుపోటు కాదని, జగనే తనకు వెన్నుపోటు పోడిచారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
వైసీపీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్క ఎమ్మెల్యేకి చంద్రబాబు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్‌పై అంతర్గతంగా విచారణ చేపట్టామని సజ్జల తెలిపారు. ఈ క్రమంలో ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని.. అలాగే క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ చెప్పి వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తు తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశామని సజ్జల స్పష్టం చేశారు.
సీట్లు ఇవ్వము అని చివరి వరకు తాము మభ్య పెట్టమని.. వీరిపై నివేదికలు తెప్పించి టికెట్ ఇవ్వడం కుదరదని ముందే చెప్పామని సజ్జల స్పష్టం చేశారు. నలుగురు ఎమెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో వెనకబడి ఉన్నారని.. కోట్లాది రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నాయకులూ అనే వాళ్ళు అధినేత నిర్ణయానికి పార్టి నిర్మాణానికి కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. టిడిపితో వెళ్ళాలి అనుకుంటే బహిరంగంగా వెళ్లొచ్చని.. ఇలా సొంత పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం లేదని సజ్జల దుయ్యబట్టారు. అపోహలు ఉంటే తొలగించే వాళ్లమని, కానీ పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తే ఉపెక్షించమని ఆయన తేల్చిచెప్పారు.
పార్టీకి సంబంధించి లైన్ దాటితే ఇలాగే ఉంటుందని.. వైసీపీకి ఒక విధానం ఉంటుందని , అది ఎంటో అందరికీ తెలియాలన్నారు. టికెట్ ఇవ్వకుండా తప్పించినంత మాత్రాన వారికి భవిష్యత్ లేనట్లు కాదన్నారు. అసంతృప్తి ఉంటే పార్టీలో ఉండొచ్చు పార్టీ నేతలకు చెప్పొచ్చని సజ్జల సూచించారు. టికెట్ లేకపోతే రాజకీయా భవిష్యత్ సంగతి తాను చూసుకుంటానని సీఎం అందరికీ చెప్పారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఎన్నికలకు సంవత్సరం ముందే టీడీపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళడానికి కారణాలు డబ్బు కాకుండా ఏముంటాయని సజ్జల నిలదీశారు. వాళ్లు డబ్బులు తీసుకున్నారు అనడానికి ఆధారాలు లేవని.. కాకపోతే అమ్ముడు పోకుండా మరి టీడీపీకి ఓటు ఎందుకు వేస్తారని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి అమ్మడం కొనడం అలవాటేనని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
