ముందు తుఫాను బాధితులకు సాయం అందించండి అధికారులతో చర్చల పేరుతో ఆటంకాలు కలిగించవద్దు మంత్రి నారాయణపై కోటంరెడ్డి విమర్శ
వార్ధ తుఫానుతో నెల్లూరు అంతా అతలాకుతలం అవుతుంటే.. పురపాలక మంత్రి నారాయణ రివ్యూల పేరుతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు.
అధికారులు, సిబ్బంది సమయాన్ని రివ్యూల పేరుతో వృధా చేయవద్దని సూచించారు
తుఫాను ప్రభావంతో నెల్లూరులోని 18, 21 వ జివిజన్ల లోని జలమయమైన నక్కలగుంట, గంగోత్రినగర్, కొండాయపాళెం ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అధికారులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సహాయక చర్యలు చేపట్టడంలో సహకరించాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి కాంట్రాక్ట్ ప్రతినిధులను కోరారు. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఆయన సంభందిత అధికారులకు ఫోన్ చేయగా, వారు మంత్రి రివ్యూ మీటింగ్ లో ఉన్నామని బదులిచ్చారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహానికి గురై, ఇంఛార్జ్ కమీషనర్ గా ఉన్న జేసి ఇంతియాజ్ అహ్మద్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
రివ్యూ మీటింగ్ ల పేరుతో కిందిస్థాయి అధికారుల పనులకు అడ్డంకి కల్పించవద్దని చెప్పారు. వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే సహాయక చర్యలు త్వరితగతిన చేయగలరని సూచించారు. ఇది మంత్రి నారాయణకు తన సూచన అని జేసీకి వెల్లడించారు. స్పందించిన జేసీ 15 నిముషాల వ్యవధిలో ఆ ప్రాంతానికి అధికారులను పంపారు.
అనంతరం కోటంరెడ్డి మాట్లాడారు. తుఫాను నేపద్యంలో సహాయక చర్యలు అధికారులు బాగా చేశారని అభినందించారు. కిందిస్థాయి అధికారులు అయితే అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్నారని అన్నారు. చల్లా యానాదులు రెండు రోజుల నుండి పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని, వారికి రేషన్ షాపు ద్వారా తగిన సహాయం అందజేయాలని అధికారులను ఆయన అభ్యర్ధించారు.
