Asianet News TeluguAsianet News Telugu

Kondapalli municipality: ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. ఆ తర్వాతే తేలనున్న విజేత..

ఎంతో ఉత్కంఠ నెలకొన్న కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ (Kondapalli municipal chairman), వైఎస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక ఫలితాలను అధికారులు సీల్డ్ కవర్‌లో ఉంచి హైకోర్టు‌కు సమర్పించనున్నారు. కేశినేని నాని (kesineni nani) ఎక్స్‌ అఫీషియో సభ్యత్వంపై హైకోర్టు (AP High Court) తీర్పు వెల్లడించిన తర్వాత కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎవరనేది తేలనుంది

kondapalli municipal chairman election Completed Official store result in sealed cover
Author
Kondapalli, First Published Nov 24, 2021, 12:39 PM IST

ఎంతో ఉత్కంఠ నెలకొన్న కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ (Kondapalli municipal chairman), వైఎస్ చైర్మన్  ఎన్నిక పూర్తయింది. ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో తొలి రెండు రోజలు కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా.. హైకోర్టు (AP High Court)  ఆదేశాలతో అధికారులు బుధవారం ఎన్నిక నిర్వహించారు. ఇందుకోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో దాదాపు 750 మంది పోలీసులను మోహరించారు. చైర్మన్ ఎన్నికకు ముందుగా వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. 

చైర్మన్ అభ్యర్థిగా.. టీడీపీ తరఫున చెన్నుబోయిన చిట్టిబాబు, వైసీపీ తరఫున జోగు రాము బరిలో నిల్చారు. చిట్టిబాబుకు 15 మంది టీడీపీ అబ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉన్న ఎంపీ కేశినేని నాని మద్దతు తెలిపారు. జోగు రాముకు 14 మంది వైసీపీ అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణా ప్రసాద్ మద్దతుగా నిలిచారు. చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. ఎన్నికకు సంబంధించిన వీడియోను అధికారులు రికార్డు చేశారు.

మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక ఫలితాలను అధికారులు సీల్డ్ కవర్‌లో ఉంచి హైకోర్టు‌కు సమర్పించనున్నారు. కేశినేని నాని ఎక్స్‌ అఫీషియో సభ్యత్వంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎవరనేది తేలనుంది. కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యత్వానికి హైకోర్టు అనుమతిస్తుందా..? లేదా..? అనేది మరింత ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యత్వాన్ని హైకోర్టు అనుమతించకపోతే.. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక టైగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక, ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 29 వార్డులకు గానూ.. టీడీపీ, వైసీపీలు చెరో 14 వార్డుల్లో విజయం సాధించాయి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన శ్రీలక్ష్మి.. ఆ తర్వాత టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీకి మద్దతుగా సభ్యుల సంఖ్య 15కి చేరింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని  (kesineni nani), వైసీపీ తరఫున ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ (vasantha krishna prasad) ఎక్స్ అఫీషియో ఓటు (ex officio vote) వేయాల్సి ఉండింది. 

అయితే గత రెండు రోజులుగా కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక వాయిదా పడింది. విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం లేదని వైసీపీ తీవ్ర అభ్యంతరం చెబుతుంది. ఇదే విషయమై వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆందోళనలకు దిగారు. దీంతో ఎన్నికల ప్రక్రియను  వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో టీడీపీ మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను నిర్వహించింది. మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ సీపీ, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ ను కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

అధికారులు కోర్టుకు హాజరైన తర్వాత.. బుధవారం మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ఎన్నికను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా సీల్డ్ కవర్లో అందించాలని హైకోర్టు ఆదేశించింది.  అయితే ఛైర్మెన్, వైఎస్ ఛైర్మెన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు  కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios